లోకేశ్వరం, ఏప్రిల్ 2 : భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్లలో నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయి. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో 15,600 ఎకరాల్లో వరి సాగైంది. మొత్తం బోరుబావుల కిందనే సాగు చేశారు. భూగర్భ జలాలు అడుగంటడంతో సాగు నీరు అందడం లేదు. ఒక్కో రైతు రెండు, మూడు బోర్లను 300 ఫీట్లు వేసినా నీరు పంటలకు సరిపోవడం లేదు. ఫలితంగా పంటలు ఎండి దిగుబడి వచ్చే అవకాశం లేదు.
రాయపూర్ కాండ్లి గ్రామానికి చెందిన యువరైతు షేక్ నజీముద్దీన్ గత జనవరిలో బోరు వేయించగా నీళ్లు బాగా పడ్డాయి. ఇప్పటికే రెండు బోరు బావులు ఉండగా.. మరో బారుబావిని 300 ఫీట్ల వరకు వేయించాడు. బోరు వేసినప్పుడు నీళ్లు బాగా పడటంతో తనకున్న మూడున్నర ఎకరాలకు తోడు మరో మూడెకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఇప్పటికే దాదాపు రూ.3 లక్షలకుపైగా ఖర్చు చేశాడు. ప్రస్తుతం వరి పొట్ట దశకు రావడంతో నీరు చాలా అవసరం ఉంటుంది. ఉన్న మూడు బోర్లు వట్టిపోవడంతో వరికి నీరందించలేని దుస్థితి నెలకొన్నది. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతు ఆవేదన చెందుతున్నాడు.
కాంగ్రెస్ సర్కార్ వచ్చినంక సాగు నీళ్ల కోసం అవస్థ పడుతున్నామని, కండ్ల ముందే పంటలు ఎండిపోతున్నామని మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం బోడ్కతండా రైతు భూక్య నరేశ్ ఆవేదన వ్యక్తంచేశాడు. రూ.2 లక్షల రుణమాఫీ అవుతుందని, ఎకరానికి రూ.15 వేలు రైతు భరోసా ఇస్తారనే ఆశతో కాంగ్రెస్కు ఓటు వేసి తప్పు చేశామని, అప్పుడు ఓటు వేసి ఇప్పుడు అనుభవిస్తున్నామని చెప్పాడు. వానకాలం వర్షాలకు పంటలు దెబ్బతింటే పంట నష్టం రాలేదని, బ్యాంకు లోను రూ.1.20 లక్షలు ఉంటే మాఫీ కాలేదని పేర్కొన్నాడు. కాల్వ నీళ్లు వస్తాయని ఆశతో యాసంగిలో రెండు ఎకరాలు వరిసాగు చేసినంక బావి ఎండిపోయిందని ఆవేదన చెందాడు. రూ.50 వేలు పెట్టుబడి పెడితే పంట ఎడ్లకు మేతగా మారిందని అన్నాడు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నడి వేసవిలోనూ కాల్వ నిండా నీళ్లు వచ్చాయని, కాంగ్రెస్ వచ్చినంక నీళ్ల కోసం గోస పడుతున్నామని చెప్పాడు. – నర్సింహులపేట
పంట సాగు చేస్తే ఎరువులు, విత్తనాలు, కూలీల కోసం పెట్టుబడి పెట్టాల్సి వచ్చేదని, ఇప్పుడు పంటను కాపాడుకునేందుకు నీటి కోసం కూడా పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం జీబీ తండా రైతు బానోత్ ఠాను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తాను ఆరు ఎకరాల పొలం సాగు చేయగా.. ఈ సారి దేవాదుల కాల్వల ద్వారా చెరువులు, కుంటలు నింపకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి బావులు, బోర్లలో నీరు లేకుండా పోయిందని పేర్కొన్నాడు. ఇప్పటివరకు రూ.3.50 లక్షలు పెట్టుబడి పెట్టినట్టు తెలిపాడు. కనీసం పెట్టుబడైనా వస్తుందా అని ఆవేదన చెందుతన్నాడు. ఇంతటి కరువు ఎన్నడూ చూడలేదన్నాడు. – స్టేషన్ ఘన్పూర్