నమస్తే తెలంగాణ యంత్రాంగం, మార్చి 22: ఇప్పటికే సాగునీరు లేక అల్లాడుతున్న రైతన్నలను అకాల వర్షాలు నిండాముంచాయి. ట్యాంకర్లను తెచ్చి మరీ పంటలను కాపాడుకుంటుంటే ఈ వర్షాలు కాస్త నేలపాలు చేశాయి. ముఖ్యంగా వరి, మక్కజొన్న పంటలు నేలకొరిగాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి, సిరికొండ, నిజామాబాద్ రూరల్, బోధన్, రాజంపేట్, భిక్కనూరు, సదాశివనగర్ తదితర మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. సారంగపూర్ మండలం పాల్దలో వరి పైర్లు నేలకొరిగాయి. వాడీ, దమ్మన్నపేట్ గ్రామాల్లో 174 మంది రైతులకు చెందిన 265 ఎకరాల వరి పంటకు నష్టం వాటిల్లిందని రూరల్ ఏడీఏ ప్రదీప్‌కుమార్ తెలిపారు. రాజంపేట మండలంలో మక్కజొన్నకు తీవ్ర నష్టం వాటిల్లింది. తలమడ్ల, ఆరెపల్లి, ఆర్గొండ, బస్వన్నపల్లి గ్రామాల్లో 26 ఎకరాల్లో నష్టం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. భిక్కనూరు మండలం లక్ష్మీదేవునిపల్లిలో బొప్పాయి తోటకి తీవ్ర నష్టం వాటిల్లింది. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో 70 ఎకరాల్లో మక్క, 70 ఎకరాల్లో వరి పంటలకు నష్ంట వాటిల్లింది. దండేపల్లి మండలంలో 7 గ్రామాల్లో 86 ఎకరాల్లో మక్క పంట దెబ్బతిన్నదని అధికారులు తెలిపారు.
అన్నదాతలను ఆదుకోండి: సుంకె
చొప్పదండి, మార్చి 22: కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో శుక్రవారం కురిసిన అకాల వర్షానికి నేలకొరిగిన పంటలకు ప్రభుత్వం రూ.20 వేల నష్ట పరిహారం చెల్లించి, అన్నదాతలను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. చొప్పదండి మండలంలో అకాల వర్షానికి నేలకొరిగిన పంటలు, చొప్పదండి వ్యవసాయ మారెట్లో తడిసిన ధాన్యాన్ని శనివారం ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు.