నమస్తే నెట్వర్క్, మే 5: అకాల వర్షం.. రైతన్నకు అపార నష్టాన్ని తెచ్చింది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వాన కండగండ్లే మిగిల్చింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోగా, రైతులు లబోదిబోమన్నారు. అప్పారావుపేటలో ధాన్యం రాశులపై కవర్లు లేచిపోగా, కొంత ధాన్యం కొట్టుకుపోయింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని అన్ని గ్రామాలతోపాటు రామడుగు మండలం వెలిచాల, వెదిర, దేశరాజ్పల్లి, షానగర్, పందికుంటపల్లి, కిష్టాపూర్, వన్నారం, కొక్కెరకుంట గ్రామాల్లో గంటపాటు వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి తెచ్చి ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరారు. మానకొండూర్ మండలంలో ఆదివారం రాత్రి వీచిన ఈదురు గాలులకు జగ్గయ్యపల్లి, లక్ష్మీపూర్, ఈదులగట్టెపల్లి, రంగపేట, వెల్ది, వేగురుపల్లి గ్రామాల్లోని మామిడి కాయలు నేలరాలడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కాగా నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. నిజామాబాద్ నగరంతోపాటు డిచ్పల్లి, మాక్లూర్, కోటగిరి, భీమ్గల్, రుద్రూర్, ఆలూరు, చందూరు, ఆర్మూర్ తదితర మండలాల్లోని మార్కెట్ యార్డుల్లో వడ్లు, మక్కలు తడిసిపోయాయి. ఈదురుగాలులకు చెట్లు, స్తంభాలు నేలకొరిగాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. భీమ్గల్-ఆర్మూర్ మధ్య రహదారిలో పదుల సంఖ్యలో చెట్లు నేలకూలడంతో రాకపోకలు నిలిచి పోయాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు చోట్ల వర్షం కురిసింది.