Telangana | హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సాగు, తాగునీటి ఇక్కట్లు ఎక్కువయ్యాయి. కరెంటు కష్టాలకు తోడు.. పంటలు ఎండుతున్నాయి. తాగునీటి కోసం మళ్లీ బిందెలు పట్టుకొని రోడ్లు ఎక్కాల్సిన దుస్థితి వచ్చింది.. అని ప్రజల నీటిగోస వాస్తవ పరిస్థితిని అన్నిపార్టీల ఎమ్మెల్యేలు జీరో అవర్‌లో శాసనసభ దృష్టికి తీసుకొచ్చారు. ఎండకాలమైనా సాగునీటి కాల్వల్లో పూడికతీతలు మొదలు పెట్టాలని ప్రభుత్వానికి విన్నవించారు. కాల్వల్లో పూడికతీయక, సాగునీరు రావడం లేదని, విద్యుత్తు సమస్యతో సాగు, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యేలు సభ దృష్టికి తెచ్చారు. వివిధ ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేసి పంట పొలాలను కాపాడాలని కొందరు ఎమ్మెల్యేలు కోరారు. రంజాన్ మాసంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలిగించొద్దని విన్నవించారు. నాణ్యమైన కరెంటు రాక మోటర్లు కాలిపోతున్నాయని అధికారులకు ఫోన్లు చేస్తుంటే బడ్జెట్ లేదని అంటున్నారని దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.
ఫ్యూచర్ సిటీకి అన్ని గ్రామాలను తీసుకోండి: సబితా ఇంద్రారెడ్డి
ఫ్యూచర్ సిటీ కోసం ఏడు మండలాల పరిధిలోని అన్ని గ్రామాలను తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఏడు మండలాల్లోని 52 గ్రామాలనే తీసుకుంటామని చెప్పడంతో దీపం చుట్టూ చీకటిలాగా తమ బతుకులు ఆగమైతవుయాని రైతులు, ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. ఏ ప్రాతిపకదిన ఆ కొన్ని గ్రామాలను తీసుకున్నారో అర్థం కావడం లేదని చెప్పారు. ఫ్యూచర్ సిటీకి కూడా హెచ్ఎండీఏ విధి విధానాలు ఉండాలని సూచించారు. కొంగరకలాన్ నుంచి 300 ఫీట్ల రోడ్డు అవసరం లేదని, ఇప్పటికే 200 ఫీట్ల రోడ్డు వేశామని, ఉన్నదానిని అభివృద్ధి చేస్తే సరిపోతుందని తెలిపారు. 15వేల ఎకరాలను సేకరించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు ప్రజలు భయాందోళనతో ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం దగ్గర ఇప్పటికే 14 వేల ఎకరాల భూమి ఉన్నదని, తక్షణం భూసేకరణ ఆపాలని ఆమె డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఈదురు గాలులతో చెట్లు కూలి, 100కు పైగా విద్యుత్తు స్తంభాలు నేలకూలాయని తెలిపారు. దీంతో డబ్బా దుకాణాలు గాలికి కొట్టుకుపోయాయని, బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
ప్రొటోకాల్ పాటించకపోతే ఎర్రగడ్డలో పడేయండి
‘నాది ప్రొటోకాల్ సమస్య. ఏదైనా కార్యక్రమాలకు నేను వెళ్లకముందే నాపై ఓడిన నేత పునాదిరాళ్లు వేస్తున్నారు. కొబ్బరికాయ కొడుతున్నారు’ అని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి తెలిపారు. అధికారులను అడిగితే రెండుసార్లు ఓడిపోయారు కదా సార్ మీరే ఓపిక చేసుకోండని చెప్తున్నారు. అటువంటప్పుడు ఆ ఓపిక లేని వాళ్తను తీసుకొచ్చి ఎర్రగడ్డ దవాఖానలో వేయండని హెచ్చరించారు. తాము చేయాల్సిన పనులను వాళ్లు చేస్తుంటే తమకు కూడా సీఎం రేవంత్‌రెడ్డిలాగా రక్తం మరుగుతుందని అన్నారు. దీనికి భట్టి విక్రమార్క కలుగజేసుకొని ‘సమస్యను సభ దృష్టికి తీసుకురండి. పరిష్కారం తీసుకోండి. మైక్ దొరికింది కదా అని ఆవేశంగా మాట్లాడితే ఎలా? ఎగతాళిగా మాట్లాడుకోవడానికి కాదు వచ్చింది’ అని సున్నితంగా హెచ్చరించారు. అనంతరం కూనంనేని సాంబశివరావు జాబ్ క్యాలెండర్లో మీద ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు.