హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : ‘కేంద్రం ఇచ్చిన కోటా మేరకే పంటలు సేకరిస్తాం. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంటలు కొనబోము’ అని రాష్ట్ర మంత్రివర్గ భేటీలో నిర్ణయించడంతో రాష్ట్రంలో పంటల సాగు అయోమయంలో పడింది. ‘కేంద్రం ఎంత కొంటే అంతే ఫైనల్.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ పంటలూ కొనుగోలు చేయం’ అన్న పిడుగులాంటి వార్తతో రాష్ట్ర రైతాంగమంతా సందిగ్ధంలో పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ క్రీడలో తెలంగాణ రైతాంగాన్ని సమిధలుగా మార్చుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారి కయ్యంతో వానకాలం పంట సాగు విషయంలో సంకట పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే వానకాలం సాగు పనులను రైతులు మొదలుపెట్టారు. ఎవరి సదుపాయాలకు తగ్గట్టుగా వారు నార్లు పోయడం, విత్తనాలు వేయడం, ఇతర ఏర్పాట్లలో రైతు కుటుంబాలు నిమగ్నమయ్యాయి. ఇలా రైతులంతా సాగు పనుల్లో ఉంటే.. ఇంతలోనే కాంగ్రెస్ సర్కార్ రైతులపై ఇలాంటి బాంబు పేల్చడంతో అంతా అయోమయ పరిస్థితి నెలకొన్నది. కేంద్రం ఏ పంట కొంటుందో? ఎంత కొంటుం దో? అన్న విషయాలు అటు సర్కార్ చెప్పక, రైతాంగానికి తెలియక ఆందోళన చెందుతున్నారు. కేంద్రంపై నెపంనెట్టి హడావుడి ప్రకటన చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. సాగుకు సంబంధించి రైతులకు స్పష్టత ఇవ్వకుండా గాలికి వదిలేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
‘కేంద్ర ప్రభుత్వం ఏ పంటను ఎంత కోటాలో కొనుగోలు చేయాలంటే అంతే కొంటాం’ అంటూ రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రకటించింది. తాము కొనుగోలు చేయబోమని చెప్పిన రాష్ట్ర సర్కార్‌పై.. కేంద్రం ఏ పంట ఎంత కొనుగోలు చేస్తుందో చెప్పే బాధ్యత కూడా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత వానకాలంలో రాష్ట్రంలో 1.37 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో వరి 69.89 లక్షల ఎకరాల్లో, మక్క 6.9 లక్షలు, కందులు 4.31 లక్షలు, పత్తి 50.70 లక్షలు, వేరుశనగ 25 వేలు, జొన్న 24 వేల ఎకరాల చొప్పున సాగయ్యాయి. ఈ వానకాలంలోనూ 1.38 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఇందులో గతంలో మాదిరిగానే వరి 69 లక్షల ఎకరాల్లో, కందులు 5 లక్షలు మక్క 7 లక్షలు, పెసర 50 వేలు, జొన్నలు 30 వేలు, పత్తి 53 లక్షల ఎకరాల చొప్పున సాగవుతాయని అంచనా వేస్తున్నది. కేంద్రం ఏఏ పంటలు కొనుగోలు చేస్తుంది? ఎంత కొనుగోలు చేస్తుంది? అన్న అంశంపై రాష్ట్ర సర్కార్ స్పష్టత ఇవ్వడమే లేదు. రాష్ట్రం ఎంత పంట కొనుగోలు కేటాయిస్తుంది? జిల్లాల వారీగా కోటా పెడుతారా? ఎలా? అనే అంశాలపైనా స్పష్టత కొరవడింది.
కేంద్రం నేరుగా ఎప్పుడూ కూడా ఇంత పంట కొనుగోలు చేస్తామని చెప్పదు. అందుకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అంటే సివిల్ సైప్లె విభాగానికి, వ్యవసాయ శాఖకు, మార్క్‌ఫెడ్‌కు అందిస్తుంది. కేంద్రం ఇచ్చిన సమాచారం అధారంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వివరాలు తెలుపాలి. ఇందుకోసం ఇప్పటికే కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపాలి. కానీ ఇవేవీ చేయకుండా ‘గుడ్డెద్దు చేనులో పడ్డట్టు’గా హడావుడిగా ఇన్ఫార్మల్ పేరుతో క్యాబినెట్ భేటీ ఏర్పాటుచేసి, నిర్ణయం తీసుకొని రైతులపై రుద్దుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎలాగూ కొనుగోలు చేయడం చేతకాదని చెప్తున్నారని, కనీసం కేంద్రం ఎంత కొంటుందో? ఏ పంట కొంటుందో? చెప్పడం కూడా చేతకాదా? అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని పంటల సాగుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
‘కేంద్రం కోటా మేరకే కొనుగోలు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంటలు కొనుగోలు చేసే ప్రసక్తే లేదు’ అంటూ అకస్మాత్తుగా రాష్ట్ర మంత్రివర్గ ప్రకటనతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇటు కేంద్రం, అటు రాష్ట్రం కొనుగోలు చేయకపోతే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ వానకాలంలో పంటలు వేయాలా? వద్దా? గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు నర్మగర్భంగా ప్రకటనలు చేసి తర్వాత కొనుగోలు చేయకపోతే తాము అన్యాయమైపోతామని ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం పంటలు కొనుగోలు చేయబోమని నిర్ణయిస్తే.. అదే నిర్ణయాన్ని బహిరంగంగా స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ‘పాము చావకుండా, కర్ర విరుగకుండా’ ఉండే ప్రకటనలను ప్రభుత్వం చేస్తూ రైతులను ఇబ్బందులు పెట్టొద్దనే వాదనలు వినిపిస్తున్నాయి. కనీసం ఏ పంటను ఎంత కొంటారో? అనే దానిపైనా స్పష్టత ఇస్తే ఆ పంటలను, ఆ మేరకు సాగు చేసేందుకు రైతులు ప్రణాళికలు వేసుకొంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతులతో మునుపెన్నడూ లేనిరీతిలో ఇలా దొంగచాటు రాజకీయాలు చేయడం దారుణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పంటలు సాగుచేసిన తర్వాత ప్రభుత్వం కొనుగోలు చేయకుంటే వ్యాపారుల దయతోనే రైతులు బతుకాల్సిన దుస్థితి దాపురిస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే చివరికి రైతులకు ప్రైవేట్ వ్యాపారులే దిక్కవుతారని అంటున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు రైతులను నిండా ముంచడం ఖాయమని, ‘అడ్డికి పావుశేరు’ చొప్పున పంట దిగుబడులను కొనుగోలు చేసి నిలువు దోపిడీ చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే రైతులు మళ్లీ అప్పులపాలై.. రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు తప్పవనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.