హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): రైతులకు రుణమాఫీ పైసలు జమ కావడం లేదు. నాలుగో విడత రుణమాఫీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించి 10 రోజులవుతున్నా ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో పైసలు పడలేదు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలిసింది. రుణమాఫీ అర్హుల జాబితాను బ్యాంకులకు, గ్రామాలకు అందించిన ప్రభుత్వం.. పైసలు మాత్రం తర్వాత ఇస్తామని చెప్పినట్టు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పుడే పైసలు జమ చేయడం ప్రారంభించినట్టు తెలిసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలోనే రై తులకు రుణమాఫీతోపాటు అనేక సంక్షేమ ప థకాలు అమలుచేసినట్టు చెప్పిన ప్రభుత్వం.. నవంబర్ 30న మహబూబ్నగర్లో రైతుపండుగ పేరుతో విజయోత్సవాలు నిర్వహించింది. ఈ సభలోనే సీఎం రేవంత్రెడ్డి అర్భాటంగా 3.13 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ. 2747.67 కోట్లతో నాలుగో విడ త రుణమాఫీ చేసినట్టు ప్రకటించారు. ఇందు కు సంబంధించి సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మలతోపాటు ఇతర మంత్రులు స్వయంగా రైతులకు రుణమాఫీ చెక్కులు అందించారు. కానీ, ప్రచారం కోసం సభలో ఇచ్చిన చెక్కు.. చెల్లని చెక్కుగా మారిపోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతు పండుగ సందర్భంగా రుణమాఫీ అంటూ హడావిడి చేసిన ప్రభుత్వం.. ఆ తర్వాత నిధులు విడుదల చేయకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రూ.2 లక్షల్లోపు మొత్తం రుణాలు మాఫీ చేసినట్టు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించడంతో రైతులు బ్యాంకులకు పరుగెడుతున్నారు. తమకు మాఫీ అయ్యిందో లేదో తెలుసుకునేందుకు అధికారులను సంప్రదిస్తున్నారు. అయితే అప్పటికే గ్రామాల్లోకి రుణమాఫీ అయిన రైతుల జాబితాలు పంపించారు. ఆ జాబితాలో పేర్లున్న రైతులు బ్యాంకులకు వెళ్లగా వారికి నిరాశే ఎదురైంది. రుణమాఫీ పైసలు జమ కాలేదని బ్యాంకు అధికారులు చెప్పడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు.
రూ.2 లక్షల వరకు రైతులందరికీ రుణమాఫీ చేసినట్టు ప్రకటించిన ప్రభుత్వం.. రూ.2 లక్షలకు పైగా రుణమాఫీకి సంబంధించి మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. వీరికి ఎప్పుడు రుణమాఫీ చేస్తారో కూడా తెలియని పరిస్థితి. ఇప్పటి వరకు ప్రభుత్వం నాలుగు విడతల్లో 25.35 లక్షల మంది రైతులకు రూ.20,616 కోట్ల రుణాలను మాఫీ చేసింది. వాస్తవానికి ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీకి అర్హులైన రైతులు 42 లక్షల మందికి రూ.31వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వమే ప్రకటించిం ది. అయితే ఇప్పటి వరకు 25.35 లక్షల మంది రైతులకు మాత్రమే రూ.20,616 కోట్లు మాఫీ చేసింది. ఇంకా 16.65 లక్షల మందికి రూ.10,384 కోట్లు మాఫీ చేయాల్సి ఉంది.