హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : ఇటీవల ముంచెత్తిన మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంట నష్టం అంచనాల ను రాష్ట్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది. తొలు త 4.47 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా 1.1 లక్షల ఎకరాల్లోనే నష్టం జరిగినట్టు మాట మార్చింది. మొంథా తుఫాన్ కారణంగా 1.1 లక్షల ఎకరాల్లో వరి, మక్కజొన్న, పత్తి పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. పంటనష్టం నివేదికను కేంద్రానికి పంపించినట్టు తెలిపారు. అయి తే, పంటనష్టం తగ్గించడంపై రైతుల నుంచి తీవ్ర విమర్శలొస్తున్నాయి. ప్రాథమిక అంచనాలతో పోల్చితే తుది లెక్కల్లో 3.37 లక్షల ఎకరాల్లో కోత పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమిక అంచనాలకు, తుది అంచనాలకు ఇంత భారీ తేడా ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ చివరి వారంలో మొంథా తుఫాన్ ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో తీవ్ర నష్టం చేసింది. 4.47 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో వరి 2.82 లక్షల ఎకరాల్లో, పత్తి 1.51 లక్షల ఎకరాల్లో, మక్కజొన్న 4,963 ఎకరాల్లో నష్టపోయినట్టు వెల్లడించింది. తీరా ఇప్పుడు ఇందులో 75% కోత పెట్టడం గమనార్హం.
రైతులకు పంటనష్టం పరిహారం ఇవ్వకుండా తప్పించుకునేందుకే ప్రభుత్వం పంటనష్టంలో కోత పెట్టిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్, ప్రభుత్వం వద్ద పైసలు లేవని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు పంటనష్ట పరిహారం ఇచ్చేందుకు సర్కార్ వద్ద నిధులు లేవని, అందుకే కోత పెట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మొంథా తుఫాన్ తర్వాత వరంగల్లో పర్యటించిన సీఎం రేవంత్ పంటనష్టపోయిన ప్రతి ఎకరాకు రూ.10వేల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. ఈ లెక్కన 4,47,864 ఎకరాలకు రూ.447.86 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు దీన్ని 1.1 లక్షలకు తగ్గించడంతో రూ.110 కోట్లతో సరిపెట్టవచ్చు. అంటే సర్కార్కు రూ.337.86 కోట్లు మిగులుతాయి.
అకాల వర్షాలే కాదు.. కాంగ్రెస్ సర్కార్ సైతం రైతులకు నష్టం చేస్తున్నది. పరిహారం ఇవ్వకుం డా రైతుల ఉసురు పోసుకుంటున్నది. చివరికి సీఎం రేవంత్ స్వయంగా పర్యటించి రైతులకు హామీ ఇచ్చినా పరిహారం దక్కడంలేదు. మొన్న కామారెడ్డిలో.. నిన్న వరంగల్లో ఇదే జరిగింది. ఈ రెండు జిల్లాల్లో అకాల వర్షాలు కురియగా సీఎం రేవంత్ స్వయంగా వెళ్లి రైతులను పరామర్శించి పరిహారం ప్రకటించారు. కానీ, నేటికీ రైతులకు చిల్లగవ్వ సాయం అందలేదు. రెండేండ్లలో ఆరేడుసార్లు అకాల వర్షాలతో పంట నష్టం జరగ్గా, ప్రభుత్వం ఒకే ఒక్కసారి మాత్రమే ఎకరాకు రూ.10వేల చొప్పున పరిహారం చెల్లించింది. అది కూడా సగం మంది రైతులకే. ప్రభు త్వం అధికారికంగా ప్రకటించిన పంట నష్టానికి కూడా పరిహారం చెల్లించచడం లేదు. ఏప్రిల్, మే నెలల్లో కురిసిన వర్షాలతో 51,528 ఎకరా ల్లో పంట నష్టం జరగ్గా, మే 28న రూ.51.52 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. కానీ, నేటికీ రైతులకు ఒక్క రూపాయి రాలేదు. సెప్టెంబర్లో కురిసిన వర్షాలతో 2.36 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రకటించిన సర్కారు.. పరిహారం అందిస్తామని ప్రకటించింది. కానీ ఇ ప్పటివరకు పరిహారం ఇవ్వలేదు. నిరుడు మార్చి లో 19వేల ఎకరాల్లో పంట నష్టం జరగ్గా, సగం మందికి మాత్రమే పరిహారం అందింది. 2024 సెప్టెంబర్లో కురిసిన వర్షాలకు 4.15 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు అంచనాలుండగా, ఇప్పటివరకు ప్రభుత్వం పరిహారం కింద నయాపైసా రైతులకు చెల్లించలేదు.