హైదరాబాద్, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ) : ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 23,364 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. గతనెల కురిసిన వర్షాలకు 8,408 ఎకరాల దెబ్బతిన్నట్టు నిర్ధారణ అయిందని, బాధిత రైతులకు త్వరలోనే పరిహారం అందిస్తామని తెలిపారు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు 14,956 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా వేసినట్టు తెలిపారు. ‘గ్రామ గ్రామానికి జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నాణ్యమైన విత్తనం’ అనే నూతన కార్యక్రమాన్ని జూన్ తొలివారంలో సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ పథకం కింద వ్యవసాయ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన నాణ్యమైన విత్తనాలను అందించనున్నట్టు తెలిపారు. ప్రతి గ్రామంలో మూడు నుంచి ఐదుగురు ఆసక్తి కలిగిన అభ్యుదయ రైతులకు ఈ పథకం కింద విత్తనాలను పంపిణీ చేస్తామని తెలిపారు.