వనపర్తి, మే 16 (నమస్తే తెలంగాణ)/జడ్చర్ల, మే 16 : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలుచోట్ల శనివారం అకాల వర్షం కురిసింది. వనపర్తి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో మార్కెట్లు, కల్లాల్లో ఉన్న మక్క, వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది.
జడ్చర్ల పత్తి మార్కెట్ యార్డులో మక్కజొన్న పూర్తిగా తడిసింది. తూకం వేసిన బస్తాల కింద నుంచి నీళ్లు పారాయి. అమ్మకానికి తెచ్చి పోసిన కుప్పలు వర్షానికి తడిసిపోగా, ఆరబెట్టిన మక్కలు, ధాన్యం వర్షం ధాటికి కొట్టుకుపోయాయి. బాదేపల్లి మార్కెట్లో ఆరుబయట పోసిన ధాన్యం, మక్క తడిసి ముద్దయింది. వనపర్తిలో గాలివాన బీభత్సం సృష్టించింది. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం తుపత్రాల శివారులో పిడుగుపాటుకు రైతు వడ్డె నాగేశ్ (25) మృతి చెందగా.. అతని తండ్రి శ్రీనివాసులు గాయపడ్డాయి.