Fisheries Department | హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో సచివాలయం నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు కమీషన్ల పాలన నడుస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే సచివాలయంలో కాంట్రాక్టర్లు ఆందోళన చేసిన సంగతి సంచలనంగా మారింది. ప్రభుత్వంలో బిల్లుల చెల్లింపు కోసం ‘కొందరికి’ 20-30శాతం కమీషన్లు సమర్పించుకోవాల్సి వస్తున్నదని ఉపముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి మల్లు భట్టివిక్రమార్క చాంబర్ ముందు గుత్తేదారులు బైఠాయించారు. సర్కారులోని ఏ శాఖలో చూసుకున్నా ఇదే తంతు నడుస్తున్నట్టు కొత్తకొత్త అవినీతి లీలలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా మత్స్యశాఖలో బిల్లుల మంజూరు వ్యవహారంలో అధికారపార్టీ ‘కీలకనేత’ చక్రం తిప్పుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ ‘మెట్టు’ దాటుకుని వెళ్తేనే బిల్లులు చేతికి అందుతాయని మత్స్యశాఖలో జోరుగా చర్చ నడుస్తున్నది. కానీ కమీషన్లు తీసుకున్నా పని కాకపోవడంతో సరఫరాదారుల పరిస్థితి అగమ్యగోచరమైంది.
మత్స్యశాఖలో చేపల పిల్లల సరఫరాదారులకు కాంగ్రెస్ సర్కారు సుమారు రూ.110 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఏడాదిన్నరగా బిల్లులు రాకపోవడంతో వారంతా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం, మంత్రులు, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సరఫరాదారుల పరిస్థితిని అవకాశంగా మలుచుకున్న మత్స్యశాఖలోని కీలక స్థానంలోని కాంగ్రెస్ నాయకుడు రంగంలోకి దిగాడు. సర్కారులో తనకు పలుకుబడి ఉందని, బకాయిలు మొత్తం ఇప్పిస్తానని సరఫరాదారులకు నమ్మబలికాడు. ఇందుకోసం 12 శాతం కమీషన్ ఇవ్వాలని ప్రతిపాదన పెట్టాడు. ఏడాదిన్నరగా బిల్లులురాక, అప్పులకు వడ్డీలు కడుతూ.. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సరఫరాదారులు గత్యంతరంలేక, ఆ నాయకుడి మాటలు నమ్మి వలలో చిక్కారు. రూ.110 కోట్ల బిల్లులు మంజూరు కోసం రూ.13 కోట్లు కమీషన్లు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. సరఫరాదారుల నుంచి అడ్వాన్సు కింద రూ.కోటి తీసుకుని, మిగతా డబ్బుల కోసం బ్లాంక్ చెక్కులు తీసుకున్నాడు.
మత్స్యశాఖలో కీలక స్థానంలో ఉన్న సదరు కాంగ్రెస్ నాయకుడు బిల్లులు మంజూరు చేయించడంలో మాట నిలబెట్టుకోలేదు. ఇప్పటికే చాలారోజులు గడిచినా పైసా కూడా విడుదల కాలేదని సరఫరాదారులు మండిపడుతున్నారు. ‘బిల్లుల మంజూరు కోసం మా తిప్పలేవో మేం పడుతాంగానీ ఇప్పటికే ఇచ్చిన డబ్బులైనా వెనక్కి ఇవ్వండి’ అని నిలదీస్తే సదరు నేత ముఖం చాటేసినట్టు సరఫరాదారులు చెప్తున్నారు. గట్టిగా అడిగితే బెదిరిస్తున్నట్టు వాపోతున్నారు. కొన్నిచోట్ల మత్య్యకారులు చేపలు పట్టుకునేందుకు ఇదే నేతకు ముడుపులు సమర్పించుకోవాల్సి వస్తున్నదని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల నిర్మల్ జిల్లాలో ఇలాంటి ఉదంతమే బయటపడింది. చేపల వ్యాపారుల నుంచి కూడా డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తున్నది.