హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని బలిదేవతగా వర్ణించిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు ప్రసన్నం చేసుకోవటం కోసం ఆమె పుట్టినరోజైన డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం ఫ్యూచర్‌సిటీలోని గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం నుంచి వర్చువల్‌గా ఆయన విగ్రహాలను ప్రారంభించారు. రూ.5.8 కోట్ల వ్యయంతో 18 అడుగుల ఎత్తు ఉన్న విగ్రహాలను ఇప్పటికే ఆయా కలెక్టరేట్లలో ఏర్పాటుచేశారు. ఉద్యమకాలం నుంచి పార్టీలకు అతీతంగా పూజలందుకున్న తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చటంపై ఇప్పటికే తెలంగాణవాదులు భగ్గుమంటున్నారు. తెలంగాణకే తలమాణికమైన బతుకమ్మను తొలగించిన కొత్త రూపాన్ని ప్రజలెవరూ అంగీకరించట్లేదు. ఆ సమయంలో పుండు మీద కారం చల్లినట్టుగా ఏకంగా అన్ని కలెక్టరేట్లలో కొత్త తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించటంపై మండిపడుతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లికి, సోనియాగాంధీ జన్మదినానికి సంబంధం ఏమిటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
నేడు ఆరాధ్యదైవమా?
2004 నుంచి 2014 వరకు రాష్ట్ర ఏర్పాటుకు ఆలస్యం చేసిన కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ సమాజం మడమతిప్పని పోరాటాలు చేసింది. ఈ క్రమంలో 1200 మంది ఆత్మత్యాగాలు ఎంతో బాధించే విషయమే. ఈ క్రమంలో ఒకానొక దశలో సోనియా తెలంగాణ బలిదేవత అని నాడు టీడీపీలో ఎమ్మెల్యే పదవిలో ఉన్న నేటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణ సమాజమంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న సందర్భంలో ఆయన మాత్రం రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఫార్మాట్లో కాకుండా, మరోలా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు, అదీ విజయవాడకు వెళ్లి ఇచ్చి వచ్చిన ఘనకార్యం కూడా తెలిసిందే. మొత్తంగా కాలం మారింది. నాటి బలిదేవత నేడు రేవంత్‌రెడ్డికి ఆరాధ్యదైవమైంది. ఆమె జన్మదినం సందర్భంగా అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసేలా ప్రేరేపించింది.
ప్రస్తుతం సోనియాగాంధీకి ఏ అధికారిక పదవిలేదు., ఏ హోదా లేదు. ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కూడా కాదు. అలాంటి వ్యక్తి జన్మదినాన్ని తెలంగాణ తల్లి విగ్రహాలకు ఏమిటీ సంబంధమో అర్థం కాని ముచ్చట. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ప్రభుత్వం పార్టీ నాయకురాలి జన్మదినం సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాలు ఎలా ఆవిష్కరిస్తారో చెప్పాలి. 1200 మంది ఆత్మహత్యలకు కారణమైన నాయకురాలి బర్త్ డేను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించవచ్చా.. అనే అనుమానాలు తెలంగాణ సమాజంలో సుడులు తిరుగుతున్నాయి. తెలంగాణలో సాగుతున్న పరాధీన పాలనకు నిలువెత్తు సాక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఆవిష్కృతమైందని తెలంగాణవాదులు భగ్గుమంటున్నారు.
నిలువెల్ల గాయాల వీణ
రెండోసారి అధికారంలోకి వచ్చిన యూపీఏ తెలంగాణను కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టింది. రెండు టర్మ్‌లు ఆమె యూపీఏ చైర్‌పర్సన్‌గా ఉన్నా దేశంలోని 36 పార్టీలతో కేసీఆర్ సమ్మతి లేఖలు తెచ్చినా ఫలితం లేదు. విసుగుతో ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ జైత్రయాత్రో కేసీఆర్ శవయాత్రో’ అంటూ 2009 నవంబర్ 29వ తేదీన కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు(11 రోజులు) తెలంగాణను చూసి దేశమే నివ్వెరపోయింది. తెలంగాణ కోసం విద్యార్థి యువకిశోరాల ఆత్మహత్యల పరంపర మొదలైంది. తెలంగాణ కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండని కాంగ్రెస్‌ను దేశం ముందు కేసీఆర్ ద్రోహిగా నిలబెట్టి, రాష్ట్రం ఇవ్వక తప్పని అనివార్యతను ఆమరణ నిరాహార దీక్షతో సృష్టించారు.
అలాంటి పరిస్థితిలో కేంద్రం 2009 డిసెంబర్ 9వ తేదీన కాకతాళీయంగా సోనియాగాంధీ జన్మదినంనాడు రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసింది. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు రాష్ట్రం సోనియా గిఫ్ట్ అనగా, కేక్‌ను కోసినట్టు రాష్ర్టాన్ని కోసి ముక్కలు చేస్తారా? అని సమైక్యవాదులు ఆందోళనకు దిగారు. దీంతో కేంద్రం డిసెంబర్ 23న మరో ప్రకటన చేసి తెలంగాణను మళ్లీ కోల్డ్ స్టోరేజీలో పడేసింది. అప్పుడు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దిగ్గునలేచింది. ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. కాంగ్రెస్ నాయకుల పరాధీనతో వందలాది మంది విద్యార్థి, యువకులు ఆత్మబలిదానం చేసుకున్నారు. డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చినందుకే తెలంగాణ తల్లి విగ్రహాలు ఆవిష్కరిస్తున్నామని కాంగ్రెస్ నేతలు సర్దిచెప్పుకోవచ్చు, కానీ వెంటనే ఆ ప్రకటనను వెనక్కి తీసుకున్నారనే లాజిక్‌ను మరిచిపోతే ఎలా? ఆ తర్వాతే యువత బలిదానాలు పెరిగాయి.
ఆది నుంచి తెలంగాణ శత్రువు కాంగ్రెస్సే
2004లో తెలంగాణ రాష్ట్రం ఇస్తామన్న హామీతో తెలంగాణ కోసమే పుట్టిన నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ పార్టీతో పొత్తుపెట్టుకొని ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దిగ్విజయంగా మాట మార్చింది. 2004లో కేంద్రంలో కొలువుదీరిన యూపీఏ-1 ప్రభుత్వం రూపొందించిన కామన్ మినిమ్ ప్రోగ్రామ్‌లో తెలంగాణను చేర్చి, రాష్ట్రపతి ప్రసంగంలో రాష్ట్ర ఏర్పాటుకు బాస చేసింది. తెలంగాణ ఏమైందని గుర్తుచేసినప్పుడల్లా ఎకసెక్కాలు అడింది. తెలంగాణ ఎక్కడిదని అవహేళన చేసింది.
దీంతో రాష్ట్రంలో, కేంద్రంలో పొత్తుల భాగస్వామిగా ఉండి, కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వని తీరును లోకానికి చాటేందుకు బీఆర్ఎస్ పదవులను గడ్డిపోచలా విసిరికొట్టింది. కేంద్రం మంత్రి పదవులను కేసీఆర్ గడ్డిపోచలా విసిరికొట్టారు. 2006లో కరీంనగర్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేయగా ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణను కాటగలిపేందుకు ఉప ఎన్నికల్లో వేల కోట్లు కుమ్మరించింది. అయినా తెలంగాణ ప్రజలు గుండెను చీల్చి జై తెలంగాణ అని నినదించారు. అఖండ మెజారిటీతో కేసీఆర్‌ను గెలిపించి ఢిల్లీ పీఠానికి గుణపాఠం చెప్పారు.