హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : బయ్యారం ఉక్కు కర్మాగారంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. కిషన్‌రెడ్డి ఆదివారం హనుమకొండలో మాట్లాడుతూ.. ‘మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే నిధులు వృథా అవుతాయి. ఆ ప్రాంతంలో దొరికేది నాసిరకం ఖనిజం’ అని వ్యాఖ్యానించారు. ‘బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు’ నినాదాన్ని, విభజన హామీని కిషన్‌రెడ్డి అవమానించారని తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఖనిజం సరఫరాకు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాల్సిందిపోయి ఫ్యాక్టరీ ఏర్పాటు వృథా అని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నిస్తున్నారు.
అసలు గనులే లేని విశాఖపట్టణంలో ఉక్కు ఫ్యాక్టరీని ఎలా ఏర్పాటుచేశారని తెలంగాణవాదులు కిషన్‌రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఎంతోకొంత ఖనిజ నిల్వలున్న బయ్యారంలో ప్లాంట్ పెడితే మాత్రం నష్టాలు వస్తున్నాయని కుంటిసాకులు చెప్తారా? అంటూ మండిపడుతున్నారు. విశాఖకు ఛత్తీస్‌గఢ్-ఒడిశాలోని బైలడిల్లా నుంచి ఇనుప ఖనిజం సరఫరా అవుతున్నదని చెప్తున్నారు. బైలడిల్లా నుంచి విశాఖకు మధ్య 550 కిలోమీటర్లకుపైగా దూరం ఉన్నదని, కానీ బయ్యారం-బైలడిల్లా మధ్య దూరం 160 కిలోమీటర్లు మాత్రమే అని చెప్తున్నారు. అయినా కేంద్రం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుతో లాభాలు రావంటూ కుంటిసాకులు చెప్తున్నదని మండిపడుతున్నారు.
అంతేకాదు, బైలడిల్లా నుంచి గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు ఇనుప ఖనిజాన్ని తరలించేందుకు కేంద్రం రెండేండ్ల క్రితం అనుమతులు ఇచ్చింది. ఈ రెండింటి మధ్య దూరం 1,800 కిలోమీటర్లు. గుజరాత్‌కు, విశాఖపట్టణానికి ఖనిజాన్ని సరఫరా చేసినప్పుడు లేని అభ్యంతరం బయ్యారానికి మాత్రమే ఎందుకు వస్తున్నదని కిషన్‌రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఇనుప ఖనిజం రవాణాకు స్లర్రి పైప్‌లైన్ లేదా రైల్వేలైన్ వేస్తే సరిపోతుందని కేసీఆర్ ప్రభుత్వం అనేకసార్లు కేంద్రానికి సూచించిందని గుర్తుచేస్తున్నారు. అవసరమైతే ఖర్చులో సగం వాటా భరించేందుకు కూడా సిద్ధమని ప్రతిపాదించినా కేంద్రం పట్టించుకోలేదని చెప్తున్నారు. దీనినిబట్టి బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టేందుకు కేంద్రానికి ఇష్టంలేదని స్పష్టమవుతున్నదని మండిపడుతున్నారు. అందుకే ‘తుప్పు’ మాటలు చెప్తున్నారని విమర్శిస్తున్నారు.