Telangana | హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో మళ్లీ ఉమ్మడి రాష్ట్రం నాటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు పాలనలో ఆంధ్రా మూలాలున్న వారిని అందలమెక్కిస్తున్నారు. తెలంగాణ భూమిపుత్రుల అవకాశాలను కొల్లగొడుతున్నారు. మన విద్యావేత్తలు, ప్రొఫెసర్లకు మొండిచెయ్యి చూపిస్తున్నారు. తాజాగా తెలంగాణ విద్యాకమిషన్ నియమించిన ఓ వర్కింగ్ గ్రూపును మొత్తం ఆంధ్రావాళ్లతో నింపేశారు. ఈ కమిటీలో ఒక్కరంటే ఒక్కరు కూడా తెలంగాణ వారు లేకపోవడం గమనార్హం. అది అత్యంత కీలకమైన తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పనకు ఏర్పాటుచేసిన వర్కింగ్ గ్రూపు కావడం విశేషం.
తెలంగాణ విద్యా విధానం రూపకల్పనకు విద్యాకమిషన్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా క్వాలిటీ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌పై అధ్యయనానికి ఐదుగురు సభ్యులతో విద్యాకమిషన్ వర్కింగ్ గ్రూపును ఏర్పాటుచేసింది. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ స్టడీస్ ప్రొఫెసర్ రేఖా పప్పు కన్వీనర్‌గా మరో నలుగురు సభ్యులుగా ఈ గ్రూపును ఏర్పాటుచేశారు. ప్రొఫెసర్ రేఖా పప్పు విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బీఏ పూర్తిచేశారు. ఇలాంటి వ్యక్తి కన్వీనర్‌గా వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేయడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రొఫెసర్ శాంతాసిన్హాను సభ్యురాలిగా నియమించారు. శాంతాసిన్హా ఏపీలోని నెల్లూరులో జన్మించారు.
మరో సభ్యుడిగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో పనిచేస్తున్న ప్రొఫెసర్ జీ నాగరాజును నియమించారు. ఆయన స్వస్థలం గుంటూ రు జిల్లా. ఎస్సీఈఆర్టీ పూర్వ డైరెక్టర్ శేషుకుమారిని మరో సభ్యురాలిగా నియమించారు. ఈమె స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా. ఇవేవీ చూడకుండా మొత్తం ఆంధ్రా మూలాలున్న వారితో గ్రూపును నింపేశారు. దీంతో విద్యాకమిషన్ తీరు వివాదాస్పదమవుతున్నది. తెలంగాణ నుంచి ప్రొఫెసర్లే లేనట్టు.. విద్యావేత్తలు రాష్ట్రంలో కరువయ్యినట్టు.. ఆంధ్రా మూలాలున్న వారిని నియమించడమేంటని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు. విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. విద్యాకమిషన్ నిర్వహించిన పలు సెమినార్లు, సదస్సుల నిర్వహణకు ఆంధ్రా మూలాలున్న వారినే ఆహ్వానిస్తున్నారు.