హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా చేవెళ్లలో టిప్పర్ లారీ, బస్సు ఢీకొన్న ప్రమాదంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. టిప్పర్‌లో కంకర, బస్సులో ప్రయాణికుల ఓవర్‌లోడ్ వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని.. ఆర్టీఏ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆలస్యంగా మేల్కొన్న ఆర్టీఏ అధికారులు కఠిన చర్యలకు సిద్ధమైనట్టు తెలిసింది. వివిధ రకాల సామగ్రితోపాటు ప్రయాణికుల రవాణాకు సంబంధించిన ఓవర్‌లోడ్ సమస్యను పరిష్కరిస్తామని అధికారులు చెప్తున్నారు.
ఈ మేరకు ఓవర్ లోడ్‌తో వాహనాలు నడిపే వారు, వాటి యజమానులు, క్వారీ కంపెనీలపైనా చర్యలు తీసుకునేందుకు సమాయాత్తమైనట్టు సమాచారం. ఇందుకు సంబంధించి ప్రణాళికను సిద్ధం చేసినట్టు ఆర్టీఏ ఉన్నతాధికారులు ‘నమస్తే తెలంగాణ’కు వెల్లడించారు. ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న వాహనాలను సీజ్ చేయడంతోపాటు.. ఆ వాహనం ఏ క్వారీ నుంచి వస్తున్నదో తెలుసుకుని, ఆ క్వారీ కంపెనీ యజమానిపైనా చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. ఆర్టీఏ చట్టం సెక్షన్ 194 ప్రకారం వివరణ కోరుతామని వెల్లడించారు.
మహిళలకు ఉచిత ప్రయాణంతో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు ఓవర్‌లోడ్‌తో నడుస్తున్నాయి. భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగితే బస్సులకు సమగ్ర బీమా వర్తించేలా అధికారులు చేసిన ప్రయత్నాలు ఆదిలోనే ఆగిపోయినట్టు తెలిసింది. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉన్నప్పుడు ప్రమాదం జరిగితే బీమా వర్తించదని ఇన్సూరెన్స్ కంపెనీలు ఆర్టీసీకి స్పష్టం చేసినట్టు సమాచారం. ఒకవైపు ఆర్టీసీ ప్రమాద బాధితులకు ఏటా రూ.55 నుంచి రూ.60 కోట్ల వరకు పరిహారం ఇస్తుండటం.. బస్సులకు చెల్లించే ప్రీమియం కూడా అంతే మొత్తంలో ఉండటంతో బస్సులకు బీమా చేయించాలా? వద్దా? అని అధికారులు సందిగ్ధంలో ఉన్నట్టు తెలిసింది. మహాలక్ష్మి పథకం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు.