హైదరాబాద్, జూలై 22(నమస్తే తెలంగాణ) : ప్రతి ఎరువుల షాపు వద్ద ఇద్దరు పోలీసులను పెట్టాలంటూ కలెక్టర్లకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీచేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు పుష్కలంగా ఎరువులు ఉన్నాయని చెప్తున్న సీఎం, మరోవైపు పోలీసులను పెట్టాలని ఆదేశాలివ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం చెప్పినట్టుగా పుష్కలంగా ఎరువులు ఉంటే పోలీసులను పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని రైతు లు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా యూరియా కోసం బారులు తీరుతున్నారు. చెప్పులు, పాస్‌పుస్తకాలను క్యూలో పెట్టి గంటల తరబడి వేచి చూస్తున్నారు. రైతుకు రెండు బస్తాలకు మించి యూరియా దొరకని పరిస్థితి నెలకొన్నది. పరిస్థితి ఇలా ఉంటే రేవంత్‌రెడ్డి మాట లు భిన్నంగా ఉన్నాయి. సీఎం సోమవారం కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ రాష్ట్రంలో అవసరమైన ఎరువుల నిల్వలు ఉన్నాయని, దీంతో పాటు బఫర్ స్టాక్(అదనపు నిల్వ) కూడా ఉన్నదని సెలవిచ్చారు. రైతులను కావాలనే ఎరువుల షాపుల వద్ద క్యూలలో నిలబడేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం వ్యాఖ్యలపై రైతులు మండిపడున్నారు. గతంలో లేని క్యూలు ఇప్పుడెందుకు వచ్చాయని ప్రశ్నిస్తున్నారు.
వానకాలం సీజన్ తొలి నుంచీ యూరియా సమస్య ఏర్పడింది. ఈ సమస్యపై సీఎం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించకపోవడం గమనార్హం. కొరతపై కేంద్రానికి కనీసం లేఖ కూడా రాయలేదు. ఈ నెల 8న పలు పనులపై ఢిల్లీ వెళ్లి రాష్ర్టానికి కేటాయించిన యూరియాను విడుదల చేయాలని కోరారు. ఇతర పనుల్లో భాగంగా ఎరువుల సమస్యపై స్పందించారే తప్ప, ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి కలిసింది లేదు. గతంలో సీఎం కేసీఆర్ ఎరువులపై ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు. ఎప్పటికప్పుడు ఎరువుల నిల్వలపై నివేదికలు తెప్పించుకొని అధికారులను అప్రమత్తం చేసేవారు. లోటు కనిపిస్తే కేంద్రంతో నేరుగా చర్చలు జరిపి, అధికారులకు ఢిల్లీకి పంపించి అవసరమైన ఎరువులు వచ్చేలా చర్యలు తీసుకునేవారు.
మున్ముందు యూరియా కొరత మరింత తీవ్రమయ్యే ప్రమాదం కనిపిస్తున్నది. రాష్ట్రం లో ప్రభుత్వం, ప్రైవేటు వద్ద నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1.64 లక్షల టన్నుల యూరియా మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో ప్రైవేటు డీలర్ల వద్ద 60,411 టన్నులు, సొసైటీల వద్ద 36,140 టన్నులు, మార్క్‌ఫెడ్ వద్ద 65,617 టన్నులు, గోదాముల్లో 2,096 టన్నులు మాత్రమే నిల్వ లు ఉన్నాయి. మార్క్‌ఫెడ్ వద్ద బఫర్ స్టాక్ 4 లక్షల టన్నులు ఉండాల్సి ఉండగా కేవలం 65,617 టన్నులే ఉంది. ఈ నెలలో 1.6 లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉంటే కేవలం 89 వేల టన్నులే వచ్చింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 6.6 లక్షల టన్నుల యూ రియా రావాల్సి ఉండగా కేవలం 3.97 లక్షల టన్నులు మాత్రమే వచ్చింది. అంటే రావాల్సిన కోటా కన్నా 2.63 లక్షల టన్నులు తక్కువగా రావడం గమనార్హం. ఆగస్టు నెలలోనూ ఇదే పరిస్థితి కనిపించే అవకాశం ఉన్నదని వ్యవసాయశాఖ అంచనా వేస్తున్నది. ఆగస్టు మొదటి వారంలో మరింత యూరియా అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో యూరియా కొరతతో ఆగస్టు నెలలో మరింత ముప్పు తప్పదనే అంచనాలున్నాయి.
హైదరాబాద్, జూలై 22(నమస్తే తెలంగాణ) : ఎరువుల షాపుల ముందు యూ రియా స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ ఇన్చార్జి కార్యదర్శి సురేంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి తో కలిసి సమీక్షించారు. ఎరువుల సమస్యల ఉంటే 8977741771 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. ప్రాథమిక సహకార సంఘాల్లో ఉదయం 8 గంటల నుంచే ఎరువుల విక్రయం ప్రా రంభించాలని యూరియా పక్కదారి పట్టకుండా చూడాలని ఆదేశించారు.
కొత్తగూడెం గణేశ్ టెంపుల్/కమలాపూర్/ఎల్లారెడ్డిపేట/చెన్నూర్ రూరల్, జూలై 22: యూరియా రైతులకు తిప్పలు తప్పడం లేదు. మంత్రులు యూరియా కొరత లేదని చెప్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యూరియా దొరక్క అవస్థపడుతున్నారు. మంగళవారం అఖిల భారత ఐక్య రైతు సంఘం(ఏఐయూకేఎస్) ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించారు.
ఈ సందర్భంగా ఏఐయూకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కెచ్చల రంగారెడ్డి, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ… మంత్రులు, అధికారులు యూరియా కొరత లేదని చెప్తున్నా, క్షేత్రస్థాయిలో రైతులకు అందడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో రైతులు క్యూలో చెప్పులు పెట్టి యూరియా కోసం పడిగాపులు కాశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లోని పీఏసీఎస్ గోదాం వద్ద యూ రియా కోసం రైతులు పడిగాపులు కాశారు. అలాగే మంచిర్యాల జిల్లా చెన్నూర్ ప్రాథమిక సహకార వ్యవసాయ సంఘం సొసైటీలో ఎదుట రైతులు ఆందోళనకు దిగారు.