“20 కోట్లుంటేనే మాట్లాడు. అది టికెట్ ఖర్చే. గెలవడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంత బడ్జెట్ నీ దగ్గర ఉంటేనే సీటు ఆశించు. లేకపోతే ఆశలు వదులుకో. అనవసరంగా ఫోన్లు చేసి, కలిసి మా సమయం వృథా చేయొద్దు. ప్రత్యర్థి బీఆర్ఎస్పై గెలవడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. తొమ్మిదిన్నరేండ్లలో అభివృద్ధి ఆకాశన్నంటింది. ఎదుర్కోవడం కష్టం” ఇది కాంగ్రెస్, బీజేపీల నుంచి ఆశావహులకు చేరిన సందేశం.
“ఎమ్మెల్యే టికెట్ కోసం 20 కోట్లేంది? భూములు అమ్మకానికి పెట్టడం ఏందీ? డబ్బులు చూసి సీటు ఇస్తాననడం సరైనది కాదు. అన్ని కోట్లు ఖర్చుపెట్టి రాజకీయాల్లో ఉండాలా? టికెట్ వస్తే గెలుపు కోసం ఆస్తులన్నీ అమ్ముతావా? ఓటమి తప్పదని తెలిసీ పోటీ అవసరమా? ప్రజలందరూ బీఆర్ఎస్తోనే ఉన్నారు. ప్రతీ కుటుంబం సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్నది. ప్రజలు మళ్లీ సీఎం కేసీఆర్‌నే గెలిపిస్తారు. అనవసరంగా పోటీకి దిగి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవడం సరికాదు. టికెట్ వస్తే రానీ.. లేకపోతే లేదు. అంతేకానీ డబ్బులు ఖర్చు పెట్టొద్దు. ఓడిపోతే మనల్ని పట్టించుకునే నాథుడు ఉండడు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి”.. గ్రేటర్‌లోని ఓ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావహుడి భార్య హెచ్చరిక.
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 12 ( నమస్తే తెలంగాణ ): కాంగ్రెస్, బీజేపీ ఖరీదైన పార్టీలుగా మారిపోయాయి. ఆస్తులు అమ్ముకోవడానికి సిద్ధమైతే తప్ప ఆ పార్టీల నుంచి టికెట్ ఆశించడం వేస్ట్ అన్న భావన వినిపిస్తోంది. హైకమాండ్‌కు రూ. 20 కోట్లు అప్పజెప్పినా టికెట్‌పై గ్యారెంటీ లేదని చెబుతున్నారు. విషయం తెలిసిన ఆశావహుల కుటుంబ సభ్యులు వారిపై ఒత్తిడి పెంచుతున్నారు. కోట్లు ఖర్చు చేసి ఎన్నికల్లో నిలబడాల్సిన అవసరం లేదని తెగేసి చెబుతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అడుగడుగునా కనిపిస్తున్నదని, మళ్లీ గెలిచేది బీఆరెఎస్సేనని నచ్చజెబుతున్నారు. పోటీ నుంచి విరమించుకోవాలని బతిమాలుతున్నారు. ఇంత ఖరీదైన రాజకీయం వద్దని సూచిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారి ఇళ్లలో ఇప్పుడివే చర్చలు జరుగుతున్నాయి.
భర్త టికెట్ కోసం ఓ నియోజకవర్గానికి చెందిన నాయకుడి భార్య రూ. 10 కోట్లు సమకూర్చారు. టికెట్ కోసం పోటీ బాగా ఉందని, మరింత ఖర్చు చేయాల్సి ఉందని సమాచారం అందడంతో ఆ నాయకుడు ఇప్పుడు తెలిసినవారు, బంధువుల వద్ద అప్పుకు ప్రయత్నిస్తున్నారు. భూముల తనఖాకు రెడీ అవుతుండడంతో భార్య అతడిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. “పిచ్చిగిట్ల లేసిందా? ఓడిపోతామని తెలిసినా అంత డబ్బు ఖర్చు పెట్టుడేంది? భూములు అమ్ముడు ఏందీ? టికెట్ వద్దు ఏమొద్దు. మనకు ఈ రాజకీయాలే వద్దు. మాట వినకపోతే మేం వెళ్లిపోతాం” అంటూ భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఆ ఒక్క నాయకుడికే ఎదురైన అనుభవం కాదు. రాష్ట్రంలోని చాలామంది ఆశావహుల పరిస్థితి ఇదే. అంతంత సొమ్ము ఖర్చుపెట్టాక కూడా ఓడిపోతే రోడ్డున పడాల్సి వస్తుందని బంధువులు, స్నేహితులు నచ్చజెబుతున్నారు. కొందరు నాయకులు కుటుంబ సభ్యలు మాటలు విని సైలెంట్ అయిపోతుంటే.. మరికొందరు మాత్రం ఎలాగైనా బరిలోకి దిగాలని కంకణం కట్టుకున్నట్టు తెలుస్తున్నది.
కాంగ్రెస్, టికెట్ల బీజేపీ అమ్మకాలపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయాలను పూర్తిగా వ్యాపారంగా మార్చేశారని ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అంత సొమ్ము ఖర్చుపెట్టాక గెలిచినా.. తిరిగి సంపాదనపైనే దృష్టిపెడతారు తప్ప, అభివృద్ధి ఊసెత్తరని మేధావులు సైతం హెచ్చరిస్తున్నారు. ఇది ఆరోగ్యమైన పోటీ ఎంతమాత్రమూ కాదని వాపోతున్నారు. అభివృద్ధిని కాదని టికెట్లు అమ్ముకుంటున్న కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే రాష్ట్రం అధోగతి పాలువుతుందని ప్రజలను హెచ్చరిస్తున్నారు.