రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ వాహన తయారీరంగానికి ఊతం ఇచ్చేందుకు హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేస్ నిర్వహిస్తే తప్పు!. కానీ సొంత సరదా తీర్చుకునేందుకు ఫుట్‌బాల్ ఈవెంట్ నిర్వహిస్తే ఒప్పు!! ఒక్క ఈవెంట్‌తో రాష్ర్టానికి రూ.700 కోట్ల ప్రయోజనం కల్పిస్తే అన్యాయం!.. రూ.100 కోట్ల ప్రజాధనాన్ని బూడిదలో పోసిన పన్నీరులా వృథా చేస్తే అద్భుతం!! బాజాప్తా అకౌంట్ నుంచి అకౌంట్‌కు డబ్బులు బదిలీ చేస్తే కుంభకోణం! లెక్కాపత్రం లేకుండా కోట్లు ఖర్చు చేస్తే మాత్రం ఘనకార్యం!! కాంగ్రెస్ సర్కారు తీరుపై ఇప్పుడు ప్రజల్లో ఇదే చర్చ.
వరంగల్, డిసెంబర్ 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘మెస్సీతో ఆడటం వల్ల సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సరదా తీరింది. ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్య అనుచరుల ముచ్చట తీరింది. మరి రాష్ర్టానికి ఒరిగిన ప్రయోజనం ఏమున్నది?’ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఏ ఇద్దరు కలిసినా ఇదే ముచ్చట. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా-ఈ రేసు (Formula E-Car Race) నిర్వహించినప్పుడు గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ నేతలు, నేడు మెస్సీ (Lionel Messi) ఫుట్‌బాల్ ఈవెంట్‌ను మాత్రం తమ ఘనకీర్తిగా చెప్పుకోవడాన్ని ప్రజలు ఈసడించుకుంటున్నారు. నేటి, నాటి ఈవెంట్ల మధ్య బేధాలను విశ్లేషిస్తున్నారు.
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నది. పరిషారం కోసం ప్రజలు నిత్యం రోడ్లెకుతున్నారు. బోనస్ డబ్బుల కోసం రైతులు ఎదురుచూస్తుంటే, ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు దవాఖానల పాలవుతుంటే.. ప్రభుత్వ దవాఖానల్లో మందుల కొరత వేధిస్తున్నది. ఫీజుల బకాయిలు చెల్లించాలని కాలేజీల యాజమాన్యాలు ఆందోళనబాట పట్టగా, పెండింగ్ బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు సచివాలయంలో ధర్నాలు చేస్తున్నారు.
అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చలనం లేదు. పైసా విదిల్చడం లేదు. కానీ ప్రపంచ దిగ్గజ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీతో ఫుట్‌బాల్ ఈవెంట్ నిర్వహించేందుకు మాత్రం ప్రత్యక్షంగా, పరోక్షంగా రూ.100 కోట్ల ప్రజాధనం వృథా చేసిందంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఇదే సమయంలో నాడు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫార్ములా ఈ-రేస్ వ్యవహారాన్ని గుర్తుచేసుకుంటున్నారు. నాడు మున్సిపల్ మంత్రి హోదాలో కేటీఆర్ ఫార్ములా ఈ-రేస్‌ను రప్పించి రాష్ర్టానికి దాదాపు రూ.700కోట్ల పైచిలుకు ప్రయోజనాన్ని కల్పిస్తే తప్పుపట్టిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు రూ.100 కోట్ల ‘మెస్సీ ఈవెంట్’తో ఏం తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఫుట్‌బాల్ అనేది సీఎం రేవంత్‌రెడ్డికి వ్యక్తిగత సరదా. రాజకీయాల్లోకి రాకముందు రాష్ట్ర జట్టులోనో, జాతీయ టీమ్‌లోనో ఆడిన ఆటగాడు కాదు. ఏ లీగ్ మ్యాచ్‌లో ఆడినట్టు చూడలేదని, కనీసం వినలేదని రేవంత్‌రెడ్డిని మొదటినుంచి చూసినవారు చెప్తున్నారు. తీరిక వేళల్లో ‘చుక్క తెగిపడ్డట్టు’ ఆయన ఫుట్‌బాల్ ఆడుతారని చెప్పుకొంటున్నారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్‌రెడ్డి ఫుట్‌బాల్ సరదాకు రెక్కలొచ్చాయని అంటున్నారు. తన ఆట కోసం ఎంసీఆర్హెచ్ఆర్డీలో రూ.కోట్లు ఖర్చు చేసి స్టేడియం నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా తాను ప్రొఫెషనల్ క్రీడాకారుడినని నిరూపించుకునేందుకు ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉప్పల్ స్టేడియాన్ని ఏకంగా పిక్నిక్ స్పాట్‌లా మార్చారని, ఇందుకోసం రూ.కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. తన సరదా, తన మనుమడి సరదా, తన సోదరుడి కొడుకు సహా ఇతర సంపన్నుల సరదా కోసం రేవంత్‌రెడ్డి వంద కోట్ల ప్రజాధనాన్ని సింగిల్ లెగ్‌తో కిక్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెస్సీ ఫుట్‌బాల్ ఈవెంట్‌ను పరిశీలిస్తే సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన మనుమడు, రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డి కొడుకు నయన్రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ కొడుకు, కాంగ్రెస్ నేత రోహిన్‌రెడ్డి కొడుకు సహా మరికొంత మంది సంపన్నుల పిల్లల కోసమే నిర్వహించినట్టు స్పష్టం అవుతున్నది. వారి కోసం రూ.100 కోట్ల ప్రజాధనం ఎందుకు ఖర్చు చేశారని ప్రశ్నిస్తున్నారు.
సింగరేణి ప్రగతి కోసం కార్మికులు రేయింబవళ్లు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. వారి రక్తమాంసాలతో పోగైన సొమ్మును రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తమ సోకులకు వినియోగించింది. మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు స్పాన్సర్షిప్ చేయించింది. సింగరేణి సంస్థకు, ఫుట్‌బాల్ ఈవెంట్‌కు ఏమాత్రం సంబంధం లేకపోయినా ప్రభుత్వం ఒత్తిడి చేసి క్రీడల అభివృద్ధి పేరిట రూ.10 కోట్ల నిధులను వినియోగించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో సింగరేణివ్యాప్తంగా కార్మికులు, సిబ్బంది సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు తన ఫుట్‌బాల్ ప్రాక్టీస్ కోసం జూబ్లీహిల్స్‌లోని తన ప్యాలెస్‌కు సమీపంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో రూ.5 కోట్లు ఖర్చు చేసి గ్రౌండ్ ఏర్పాటు చేయించారని ఆరోపిస్తున్నారు. దీనికితోడు మెస్సీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా పోలీసులు నిర్వహించిన భారీ బందోబస్తు, అందుకు అయిన ఖర్చు ప్రజాధనం కాదా? అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ముందు అనుకున్న బందోబస్తు మరో 1500కు పెరిగిందని, మెస్సీ పాల్గొన్న కోల్‌కతా స్టేడియంలో చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో మరింత భద్రత పెంచాల్సి వచ్చిందని, అయినా కేవలం మూడునాలుగు గంటల ప్రోగ్రామ్‌కు ఇంత హంగామా అవసరమే లేదని సాక్షాత్తు పోలీసు వర్గాలే పెదవి విరుస్తున్నాయి.
గత కొంతకాలంగా మెస్సీతో రేవంత్ ఫుట్‌బాల్ మ్యాచ్ అంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో రేవంత్‌రెడ్డి అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శనివారం ఉప్పల్ స్టేడియం వైపు రెప్పవాల్చకుండా చూశారు. తీరా అక్కడ చోటుచేసుకున్న పరిణామం చూసి ముక్కున వేలేసుకున్నారు. మెస్సీతో ఫుట్‌బాల్ ఆడుతాడనుకుంటే అంతా తుస్సు అయ్యింది. సీఎం రేవంత్‌రెడ్డితో మెస్సీ ఆడనేలేదు. మెస్సీ అసలు ఫుట్‌బాల్ డ్రెస్సే వేసుకోలేదు. నమూనాకు చిన్న కోర్టులో కేవలం కొద్దిమందితో కాసేపు ప్రాక్టీస్ సెషన్‌లా మెస్సీ బాల్‌ను అటూ ఇటు కిక్ చేశారు. మధ్యలో ప్రేక్షకుల మధ్యలోకి నాలుగు బాల్స్ కిక్ చేసి, అభివాదం చేసి వెళ్లిపోయాడు. ‘మెస్సీ వచ్చాడు.. బాల్‌ను తన్నాడు.. వెళ్లిపోయాడు. ఈ మాత్రం దానికి రాష్ర్టానికి వచ్చిన ప్రయోజనం ఏమిటి?’ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగానికి తోడ్పాటు అందించేందుకు ఎఫ్ఐఏ సంస్థ ‘ఫార్ములా- ఈ రేస్’లను నిర్వహిస్తుంది. ఈ రేస్‌ను హైదరాబాద్‌లో నిర్వహించి, తద్వారా అంతర్జాతీయంగా హైదరాబాద్ బ్రాండ్‌ను పెంచాలని నాటి పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ తపించారు. పర్యావరణ పరిరక్షణకు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, హైదరాబాద్ వరుసగా ఐదు సార్లు మోస్ట్ లివెబుల్ సిటీగా గుర్తింపు పొందడం, వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్-2022ను గెలుచుకోవడం, హరితహారం ద్వారా 6.5కోట్ల మొక్కలు నాటడం, తెలంగాణవ్యాప్తంగా గ్రీన్ కవర్‌ను పెంచడం వంటివి ఎఫ్ఐఏ నిర్వాహకులకు చెప్పి ఒప్పించారు. దీంతో దేశంలోనే తొలిసారి ఫార్ములా-ఈ కార్ రేసు హైదరాబాద్‌కు వచ్చింది. 2023 ఫిబ్రవరి 23నుంచి హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా-ఈ రేసులో మొత్తం 11 జట్ల నుంచి 22కార్లు బరిలోకి దిగాయి. ప్రఖ్యాత రేసింగ్ కంపెనీలుగా పేరొందిన మెక్లారెన్, మసారెటీ, పోశె, జాగ్వార్, నిస్సాన్ , మహీంద్రా రేసింగ్ కార్లు పోటీపడిన విషయం తెలిసిందే.
ఫార్ములా-ఈ రేసు హైదరాబాద్ నగర ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపిందని ‘నీల్సన్ స్పోర్ట్స్ అనాలసిస్’ తన అధ్యయనంలో వెల్లడించింది. ఫార్ములా- ఈ రేసు నిర్వహణతో నగర ఆర్థిక వ్యవస్థ రూ.700 కోట్ల మేర పుంజుకున్నదని, దేశంలో మరే ఇతర మెట్రో నగరానికి దక్కని ఘనతను హైదరాబాద్ సాధించిందని ఆ నివేదిక తేటతెల్లం చేసింది. ‘ఫార్ములా ఈ-రేస్ సమయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా రెస్టారెంట్లు, హోటళ్లు, ప్రకటనలు తదితరాలతో రూ.700 కోట్లకు పైగా బిజినెస్ హైదరాబాద్‌లో జరిగింది. పలు దేశాలు, రాష్ట్రాల నుంచి 35,000 మందికి పైగా హైదరాబాద్ ఈ-ప్రిక్స్‌ను వీక్షించారు. ఫార్ములా-ఈ రేసును నిర్వహించిన ప్రపంచ ప్రఖ్యాత నగరాల సరసన హైదరాబాద్ నిలిచింది. భారతదేశంలో ఫార్ములా-ఈ రేస్ జరిగిన మొదటి నగరంగా ఘనత సాధించింది’ అని నీల్సన్ సంస్థ అధ్యయనంలో తేలింది.
‘మాది ప్రజాపాలన.. ప్రజల వద్దకు పాలన’ అంటూ నిత్యం గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో మాత్రం నిత్య నిర్బంధాన్ని కొనసాగిస్తున్నది. ప్రతిపక్షం సంధించే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక ఉక్కపోతకు గురవుతూ ప్రశ్నిస్తున్న నాయకులు, కార్యకర్తలను కేసులపాలు చేస్తున్నది. తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల్లో వ్యక్తపరచినా అక్రమ కేసులు బనాయిస్తున్నది. ఈ క్రమంలో ఒక్క బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై రేవంత్ సరారు అక్రమంగా 15కుపైగా కేసు నమోదు చేసింది.
2024 ఫిబ్రవరిలో ఈ-రేస్ నిర్వహించాల్సి ఉండగా సీఎం రేవంత్‌రెడ్డి ఆ ఒప్పందాలన్నీ రద్దు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రేసు నుంచి వైదొలగడంతో ఆ కంపెనీకి కట్టిన డబ్బులు రాలేదు. రేవంత్ ప్రభుత్వ తొందరపాటు నిర్ణయం వల్ల తెలంగాణ రూ.55 కోట్లు నష్టపోయింది. కేవలం కేటీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీ పాలనను బద్నాం చేయాలనే కుట్ర వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా నష్టపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతున్నాడనే అక్కసుతో కేటీఆర్‌పై రేవంత్ సర్కార్ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ-రేస్ నిర్వహణలో ఎకడా అవినీతి జరగలేదన్నది సుస్పష్టం. డబ్బులు చేతులు మారినట్టు, క్విడ్ ప్రో కో జరిగినట్టు ఇప్పటివరకు పోలీసులు, ప్రభుత్వం ఇప్పటివరకు ఏ ఒక్క ఆధారం చూపలేదు.
రేస్ నిర్వహణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం, బ్యాంకు ద్వారా పంపిన రూ.44 కోట్లు ఇప్పటికీ ఫార్ములా-ఈ సంస్థ అకౌంట్లోనే ఉన్నాయి. అధికారికంగా, బ్యాంకు ద్వారానే నిధుల బదిలీ జరిగింది. ప్రభుత్వం పంపిన నిధులు తమకు చేరినట్టు కూడా నిర్వాహకులు బహిరంగంగానే చెప్పారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌కు వెళ్దామని కూడా ఫార్ములా ఈ రేస్ సంస్థ రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఆర్బిట్రేషన్‌కు వెళ్లి కేసు గెలిస్తే ఆ సంస్థ తెలంగాణ నుంచి పంపిన నిధులను వెనకి పంపించే అవకాశాలున్నా ఆ సంస్థతో మాట్లాడే ధైర్యం చేయలేదు. పైగా కేటీఆర్‌పై ప్రభుత్వం కేసులు పెట్టింది. గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్‌కు వెళ్లిన తర్వాత అందులో అవినీతి ఎక్కడ జరిగింది? కేటీఆర్ మొదటినుంచీ ప్రశ్నిస్తూనే ఉన్నారు. అవినీతే లేని ఈ కేసులో తాను లై డిటెక్టర్ టెస్ట్‌కు సైతం సిద్ధమని కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ సర్కార్‌కు సవాల్ విసిరారు. అయినా ప్రభుత్వం మాత్రం అవినీతి ఆరోపణలు చేస్తూనే ఉన్నది.
ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు పదేండ్లుగా వివిధ దేశాల్లో స్ట్రీట్ సర్క్యూట్లల్లో ఫార్ములా-ఈ కార్ రేసులు నిర్వహిస్తున్నారు. లండన్, బీజింగ్, సియోల్, మాస్కో, బెర్లిన్, షాంఘై, జకార్తా వంటి నగరాల్లో ఇప్పటివరకు నిర్వహిస్తున్న ఈ-రేస్‌ను హైదరాబాద్‌కు రప్పించడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో అప్పటికే ముందువరుసలో ఉన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచేందుకు దోహదం చేసింది. హైదరాబాద్ నగరానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తేవడానికి నాటి మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఫార్ములా-ఈ రేస్‌ను వాహకంగా ఎంచుకున్నారనే దిగ్గజ సంస్థలు తీర్మానించాయి.