హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ ప్రజా సమస్యల పరిషారానికి కృషి చేస్తున్న జర్నలిస్టుల దీర్ఘకాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. చాలీచాలని వేతనాలతో జీవితాలను అనుభవిస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అనేక ఉద్యమాల్లో పాత్రికేయుల పాత్ర మరువలేనిదని.. పదేండ్లుగా వివిధ కారణాలతో దాదాపు 500 మందికిపైగా జర్నలిస్టులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, అక్రిడిటేషన్లు, హెల్త్‌కార్డులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతోపాటు, జర్నలిస్టు బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరారు.