హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడం విధానంగా రేవంత్రెడ్డి సరార్ పాలన సాగిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విమర్శించారు. దళితులు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై త్వరలోనే ఉద్యమ ప్రణాళికలు చేపడుతామని జాన్వెస్లీ వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప.. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఏ పథకం కూడా అమలు కావడంలేదని విమర్శించారు. రేవంత్రెడ్డి దావోస్ పర్యటన ప్రచార ఆర్భాటమేనని, ఫోర్త్ సిటీ పేరుతో రియల్టర్లు కోట్ల రూపాయల వ్యాపారం చేసుకుంటున్నారని చెప్పారు. బీజేపీ మతోన్మాద రాజకీయాలను అడ్డుకుంటామని స్పష్టంచేశారు. గద్దర్ గురించి అవగాహన లేకుండా బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు.