హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : విద్య, వైద్యం, సంక్షేమంతోపాటు అన్ని రంగాలలో కేరళ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలిపిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ను విమర్శించే నైతిక అర్హత తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి లేదని సీపీఎం సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. తెలంగాణలో ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు రైతుబంధు, మహిళలకు రూ.2,500, వృద్ధాప్య పెన్షన్ రూ.4,000కు పెంపు నిరుద్యోగులకు ఉద్యోగం, ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తామని రేవంత్‌రెడ్డి వాగ్దానం చేశారని గుర్తుచేశారు. కేరళలో యువత రాష్ట్రం విడిచి వెళ్లిపోతున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించడం హాస్యాస్పదంగా ఉన్నదని మండిపడ్డారు. తెలంగాణలో యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? నేడు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు చెల్లించలేని పరిస్థితి ఉందని విమర్శించారు.
సీటు, ఓటు కోసం నోట్లను పట్టుకుని తిరిగిన రేవంత్‌రెడ్డి అవినీతిపై మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. నీతిగా, నిజాయితీగా కేరళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న పినరయి విజయన్ను రేవంత్‌రెడ్డి విమర్శించడం అసమంజసమని వ్యాఖ్యానించారు. కుల, మత, ప్రాంత విద్వేషాలు లేకుండా సమానత్వాన్ని పాటిస్తూ అవినీతిలేని రాష్ట్రంగా సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం పనిచేసిందని తెలిపారు. నేడు అభివృద్ధిలో కేరళ దేశంలోనే అగ్రభాగాన ఉందంటే అందుకు సీపీఎం, పినరయి విజయన్ దూర దృష్టి, కృషి ఫలితమే అని స్పష్టంచేశారు. విజయన్ రాజకీయ అనుభవమంత వయస్సు లేని రేవంత్‌రెడ్డి ఆయనను చర్చకు రావాలని చెప్పడం తన అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించి పని చేయాలి తప్ప .. కేరళ అభివృద్ధిని అడ్డుకోవద్దని సీతారాములు హెచ్చరించారు.