నిర్మల్, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ) : కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్)లో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల స్వీకరణ, కరెక్షన్, డిజిటలైజేషన్ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. నిర్మల్ జిల్లాలోని ముథోల్, ఖానాపూర్, నిర్మల్ నియోజకవర్గాల్లోని 925 పోలింగ్ బూత్ ల పరిధిలో మొత్తం 7,55,344 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 6,42,174 మంది (85.02) మాత్రమే ఎన్యుమరేషన్ ఫారాలు అందజేయగా, బీఎల్వోలు వాటిని డిజిటలైజేషన్ చేశారు. మరో 1,13,170 మంది ఫారాలు సమర్పించలేదు. వీరిలో కొందరు మరణించగా, మరికొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడే ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరికొందరు తమ సొంత గ్రామంతోపాటు జిల్లా కేంద్రంలోనూ ఓటు హక్కు కలిగి ఉండడంతో ఆయా డూప్లికేట్ ఓట్లు తగ్గినట్లు చెబుతున్నారు. దీంతో ఎన్యుమరేషన్ ఫారాలు అందని 1,13,170 మంది పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించే అవకాశం ఉన్నది.
ఎస్ఐఆర్ ప్రక్రియ ముందుగా జూన్ 25 నుంచి జూలై 24వ తేదీ వరకు నిర్వహించాలని ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈ ప్రక్రియలో ఓటర్ల నుం చి అభ్యంతరాలు రావడం, ముఖ్యంగా కొన్ని చోట్ల 2002 నాటి వివరాలు అందుబాటులో లేకపోవడంతో ప్రక్రియ నెమ్మదిగా సాగింది. దీంతో గడువును ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించారు. అయినా ప్రక్రియ ఆశించిన వేగంతో ముందుకు సాగకపోవడంతో ఎన్నికల సంఘం మరోసారి గడువు పొడిగించింది. చివరగా ఆగస్టు 10 అర్ధరాత్రి 12 గంటల వరకు తుది గడువు విధించింది. దీంతో మొత్తం 46 రోజులపాటు కొనసాగిన ఎన్యుమరేషన్ ప్రక్రియకు సోమవారం తెరపడింది.
సోమవారం అర్ధరాత్రి వరకు ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తికావడంతో అధికారులు తదుపరి దశపై దృష్టి సారించనున్నారు. ఈ నెల 17న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఓటర్లు ఈ ముసాయిదా జాబితాలో తమ పేరుందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ జాబితాలో పేరు లేకపోయినా.. పేరు, అడ్రస్, ఇతర వివరాల్లో తప్పులు ఉన్నా ఈ నెల 17 నుంచి వచ్చే సెప్టెంబర్ 16వ తేదీ వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు సమర్పించేందుకు అవకాశం ఉంటుంది. అందిన ఫిర్యాదుల ఆధారంగా నోటీసులు జారీ చేసి అక్టోబర్ 15వ తేదీ వరకు అధికారులు పరిశీలించి, అవసరమైన విచారణను పూర్తి చేసిన అనంతరం అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా ప్రకటించనున్నారు.
