Jangaon | జనగామ, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): ‘బాంచెన్.. మీ కాల్మొక్తా.. వడ్లు కొనుండి సారూ.. 12 రోజులుగా మార్కెట్ మూతపడ్డది. కూలి దొరకక తిండికి తిప్పలవుతున్నది. నాకు భర్త, పిల్లలు లేరు. 30 ఏండ్లుగా కల్లాలు ఊడ్చి రైతులు పెట్టే నాలుగు గింజలు అమ్ముకొని బతుకుతున్న. వీళ్లేమో ఇట్లా చేయబట్టిరి.. ఏం చేయాలే.. ఎక్కడికి పోవాలే’ అంటూ.. జనగామ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోళ్ల నిలిపివేతతో ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ మహిళా స్వీపర్ (దినసరి కూలీ) ఆవేదన వ్యక్తం చేసింది. మార్కెట్‌ను మళ్లీ తెరిచి అన్ని రకాల ఉత్పత్తుల కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం మార్కెట్‌యార్డు కార్యాలయం వద్ద మార్కెట్ హమాలీలు, దడువాయిలు, చాట, చీపురు కార్మికులు, కూలీలు ధర్నా చేపట్టారు. ఇదంతా అక్కడే ఉండి గమనించిన స్వీపర్ అనురాధ.. వాళ్లు చేస్తున్నది తమ కోసమే కదా అని ధర్నాలో పాల్గొన్నది. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటుండగా.. అనురాధ పోలీసు అధికారుల కాళ్లు పట్టుకొని ‘మార్కెట్ తెరిపించుండ్రి సారూ’ అంటూ ప్రాధేయపడింది. ఆమె ఆవేదనను ఏ మాత్రమూ పట్టించుకోని పోలీసులు ‘పక్కకు జరుగమ్మా’ అంటూ పలువురిని బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. దీంతో కొద్దిసేపు మార్కెట్‌యార్డు వద్ద ఉద్రిక్తత నెలకొన్నది.
12 రోజులుగా ఉపాధి లేదు
మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రైవేటు ఖరీదుదారులు సిద్ధంగా లేనందున.. వ్యవసాయ మార్కెట్‌కు రైతులు ఎలాంటి ఉత్పత్తులను తేవద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మార్కెట్ కమిటీ అధికారులు యార్డు గేట్లకు తాళాలు వేశారు. రైతుల ఆందోళనతో ఈ నెల 16న యార్డులో నిల్వ ఉన్న ధాన్యాన్ని మద్దతు ధర కంటే క్వింటాకు రూ.500 తక్కువకు కొనుగోలు చేసి బస్తాలను గోదాంలు, మిల్లులకు తరలించారు. కొనుగోళ్లు లేక యార్డు వెలవెలబోతుండగా.. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై ఆధారపడిన దాదాపు 400 మంది హమాలీ కార్మికులు, దడువాయిలు, గుమస్తాలు, చాట, చీపురు కూలీలు, ప్రైవేట్ స్వీపర్లు 12 రోజులుగా ఉపాధి కోల్పోయారు. ఈ నెల 10న మార్కెట్లో ఆందోళన తర్వాత.. జిల్లా యంత్రాంగం యార్డులోపల ఐకేపీ, పీఏసీఎస్, సివిల్‌సప్లయి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. అయితే.. అధికారులు మార్కెట్ గేట్లకు తాళాలు వేయడంతో ఈ కేంద్రాలకు ధాన్యం తెచ్చే అవకాశం లేకుండాపోయింది. దీంతో దినసరి కూలీలు, కార్మికులు రోడ్డున పడ్డారు.