హైదరాబాద్: బీజేపీని ఓడించే సత్తా టీఆర్ఎస్కే ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. అందుకే మునుగోడు ఉపఎన్నికలో తాము టీఆర్ఎస్కు మద్దుతు పలుకుతున్నామని చెప్పారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా జాతీయ పార్టీ తీర్మానం ఉందన్నారు. మునుగోడు ఉపఎన్నికపై హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం చాడా వెంకట్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉపఎన్నికల్లో సీపీఐ నిలబడే పరిస్థితి లేదని చెప్పారు. అందువల్ల బీజేపీని ఓడించే పార్టీకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
ఇది మునుగోడుకే పరిమితం కాదని, భవిష్యత్లో కూడా టీఆర్ఎస్తో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. మునుగోడు బహిరంగ సభకు రావాలని సీఎం కేసీఆర్ తమను ఆహ్వానించారని చెప్పారు. సీపీఐ నేతలు సభలో పాల్గొంటారని తెలిపారు. 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమను ఇబ్బంది పెట్టిందని చెప్పారు. తమకు కేటాయించిన మూడు సీట్లలో కూడా వారి అభ్యర్థులు పోటీచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డి స్వార్థ ప్రయోజనాల వల్లే ఉపఎన్నిక వచ్చిందని విమర్శించారు.
ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలని సీపీఐ నేతలను సీఎం కేసీఆర్ కోరిన విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి.. ముఖ్యమంత్రితో ప్రగతిభవన్లో 2 గంటలపాటు చర్చించారు.