హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): మార్చిలోగా మావోయిస్టులను అంతం చేస్తామని శపథం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దమ్ముంటే.. దేశంలోని అవినీతిని, తీవ్రవాదాన్ని అంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సవాల్ విసిరారు. తక్షణమే బూటకపు ఎన్కౌంటర్లను నిలిపివేసి, మావోయిస్టులతో శాంతిచర్చలు జరపాలని డిమాండ్ చేశారు. బూటకపు ఎన్కౌంటర్ల మారణహోమానికి వ్యతిరేకంగా శుక్రవారం లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, మేధావులు, పౌరహక్కుల ప్రతినిధులు, లాయర్లు సంఘీభావం ప్రకటించారు. కూనంనేని మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వ తీరుతో ప్రజాస్వామిక హక్కులకు విఘాతం కలుగుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ప్రొఫెసర్ లక్ష్మణ్, సీపీఐఎంల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రమేశ్‌రాజా, సీపీఐఎంల్ చంద్రన్న గ్రూపు నేత భాస్కర్ మాట్లాడారు.