హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్షా వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. తెలంగాణలో నిజాంకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు పోరాటం చేశారనడం ఆయన అజ్ఞానాన్ని బయటపెట్టిందన్నారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమయ్యేందుకు పోరాటం చేసి అమరులైన 4000 మంది త్యాగాలను, నాటి పోరాటాన్ని నడిపిన రావి నారాయణరెడ్డి, మఖ్ధూం మొహియొద్దీన్, బద్దం ఎల్లారెడ్డి పేర్లను షా ఉద్దేశపూర్వకంగానే విస్మరించారని మండిపడ్డారు.
తెలంగాణ చరిత్రపై అమిత్షా చేసిన ప్రసంగం అర్థసత్యాలతో, తప్పుడు భాష్యాలతో ఉందన్నారు. తక్షణమే ఆయన చేసిన తప్పుడు వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని గుర్తించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు ఇచ్చిన రూ.2.5 లక్షల కోట్ల నిధులు అన్నీ తిరిగి చెల్లించాల్సినవే ఉన్నాయన్నారు. వాస్తవాలను దాచి తామేదో ఘనత సాధించినట్లు చెబుతూ.. అమిత్షా తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉర్దూను రద్దు చేస్తామన్న బండి సంజయ్ వ్యాఖ్యలకు అమిత్షా సమాధానం చెప్పాలని చాడ వెంకట్రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.