CPI Narayana | హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కాంగ్రెస్ వైఫల్యాలే బీజేపీకి ఎక్కువ సీట్లు తెచ్చి పెట్టాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టంచేశారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ఐక్యత లేదని, వామపక్షాలకు అన్యాయం చేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చి కాంగ్రెస్ తప్పు చేసిందని, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చిన స్థానాల్లో ఓడిపోయారని వివరించారు.
ఏపీలో ఎవరికీ అంతపట్టని ఫలితాలు వచ్చాయని, జగన్ మీద ఉన్న వ్యతిరేకత ఎన్డీయే కూటమికి కలసి వచ్చిందని చెప్పారు. గెలిచిన చంద్రబాబుకు, పవన్‌కల్యాణ్‌కు అభినందనలు తెలియజేశారు. మోదీకి చంద్రబాబు, నితీశ్‌కుమార్ లేకపోతే ప్రధానిగా ఉండడని ఎద్దేవా చేశారు. కేంద్రం వద్ద చంద్రబాబునాయుడు కచ్చితమైన ప్రతిపాదనలు పెట్టాలని, విభజన హామీలు నెరవేర్చుకోవాలని సూచించారు. రాష్ర్టాన్ని తాకట్టు పెట్టేలా కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలని హితవు చెప్పారు. హైదరాబాద్ మీద బాబు ఆశలు పెట్టుకోకుండా, ఏపీ రాజధానిపై ఫోకస్ పెట్టాలని సూచించారు.