Narayana | హైదరాబాద్ : హర్యానా ఐపీఎస్ అధికారి వై. పూరణ్కుమార్ ఆత్మహత్య చేసుకోవడం దారుణమని సీపీఐ సెంట్రల్ కంట్రోల్ కమిషన్ అధ్యక్షులు డాక్టర్ కె.నారాయణ అన్నారు. హర్యానాలో ఐపీఎస్ అధికారి వై. పూరణ్కుమార్ ఆత్మహత్య సంఘటన దేశవ్యాప్తంగా ఆవేదన కలిగించిందని పేర్కొన్నారు.
తిరుపతి జిల్లా సీపీఐ రాజకీయ శిక్షణా తరగతులు వరదయ్య పాలెం మండల కేంద్రంలో ఐదు రోజులపాటు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరైన నారాయణ హర్యానా ఘటనపై పత్రిక ప్రకటన విడుదల చేశారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ) తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. ఆ అధికారి తనపై అధికారుల నిరంతర వేధింపులు, అవమానాలు తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నారని వార్తలు వస్తున్నాయన్నారు. హర్యానా డీజీపీ శత్రుజిత్ కుమార్ సహా బాధ్యులపై “రోహిత్ వేములా చట్టం” ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. “అధికార వ్యవస్థలో ఉన్న పీడనాత్మక, వివక్షాత్మక ధోరణులు ఈ ఘటనలో మరోసారి బయటపడ్డాయని చెప్పారు. బాధ్యులపై రోహిత్ వేములా చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవడం ద్వారానే న్యాయం సాధ్యమవుతుంది” అని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా, ఈ ఘటనపై కమిటీ ఏర్పాటు చేసి, న్యాయపరమైన విచారణ జరిపించాలని కోరారు. ఐపీఎస్ అధికారి వై.పూరణ్కుమార్ కుటుంబానికి తగిన పరిహారం అందజేయాలని డాక్టర్ నారాయణ ప్రభుత్వాన్ని కోరారు.