హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీతో మిత్రధర్మం కారణంగా నోరు మూసుకుంటున్నామని, రెండున్నరేండ్లుగా తమకు నిధులు రావడం లేదని సీపీఐ శాసనసభా పక్ష నాయకుడు కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం అసెంబ్లీలో పలు పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాకే మొత్తం నిధులు వెళ్తున్నాయని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ముగ్గురు మంత్రులున్నా, వారికి ఏమైనా వచ్చాయేమో కానీ, తమ నియోజకవర్గానికి మాత్రం రావడం లేదని స్పష్టంచేశారు. ఏమొచ్చినయో మంత్రులే చెప్పాలని కోరారు. ‘నేను ఏ ప్రతిపాదన తీసుకెళ్లినా.. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంజూరు చేస్తున్నట్టు రాస్తారు. అక్కడికెళ్తే ఒక్కటంటే ఒక్క పనీ కాలేదు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వద్దకు వెళ్లగానే ‘సాంక్షన్’ అని రాస్తారు. అయినా రెండున్నరేండ్లుగా ఒక్క పనీ కాలేదు. ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి’ అని కూనంనేని పేర్కొన్నారు. జనం మాత్రం.. సీపీఐ కాంగ్రెస్‌కు స్నేహ పార్టీ కాబట్టి వీరికి అదనంగా నిధులు వస్తున్నాయని అనుకుంటున్నారని, కానీ ఏమీ రావడం లేదని తేల్చిచెప్పారు. ‘చెప్పకూడదు కానీ.. తిట్టాలంటే తిట్టలేను. విమర్శించలేను. ఏమీ చేయలేను. బీజేపీ వాళ్లు ఇష్టమొచ్చినట్టు మాట్లాడొచ్చు. విమర్శించొచ్చు. మాట్లాడాలంటే మితృత్వం అడ్డువస్తున్నది. మాకు అదనంగా ఏమీ వద్దు.. వచ్చేవి ఇస్తే చాలు’ అని కుండబద్దలు కొట్టారు. రాష్ట్రంలో పెండింగ్‌లో దాదాపు 24 ప్రాజెక్టులున్నాయని, సాగునీటి ప్రాజెక్టుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఔట్సోర్సింగ్ కార్మికుల కోసం ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి.. కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.