CPI Narayana | అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ట్రంప్ విధానాలు ప్రపంచానికి ప్రమాదకరంగా తయారయ్యాయని ఆవేదన చెందారు. హైదరాబాద్‌లోని సీపీఐ కార్యాలయంలో గురువారం కె.నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. జంతువులను వేటాడినట్లుగా అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులను ట్రంప్ వేటాడుతున్నారని అన్నారు. భారతీయుల చేతులకు, కాళ్లకే బేడీలు వేసి జంతువులను వేధించినట్లుగా వేధిస్తున్నట్లుగా కె.నారాయణ మండిపడ్డారు. దేశం విడిచి వెళ్లేందుకు వారికి సమయం ఇవ్వకుండా ట్రంప్ దుర్మార్గుడిలా ప్రవర్తిస్తున్నారని అన్నారు.
ప్రపంచ వనరులపై అమెరికా బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి దిగజారుతోందని కె.నారాయణ అన్నారు. ఇతర దేశాల్లో ఉన్న సంపదను కొల్లగొట్టడమే అమెరికా ఎజెండాగా ఉందని ఆరోపించారు. ప్రపంచ దేశాలు అమెరికా విధానాలను వ్యతిరేకిస్తుంటే ప్రధాని మోదీ మాత్రం ట్రంప్‌కు రాయబారిగా పనిచేస్తున్నారని విమర్శించారు. దేశ నిబంధనలకు విరుద్ధంగా, అవమాన పరిచేవిధంగా, ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా ట్రంప్‌తో మోదీ చేతులు కలుపుతున్నారని మండిపడ్డారు. అమెరికా అప్పుల్లో ఉందని.. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని.. వేలాదిగా ఉద్యోగాలు పోతున్నాయని చెప్పారు. వరల్డ్ బ్యాంక్ అండగా ఉంది కాబట్టి అమెరికా బతికిపోతుందని అన్నారు.
బ్లాక్మెయిల్ రాజకీయాలతో డోనాల్డ్ ట్రంప్ ఇతర దేశాలను తనకింద పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని కె.నారాయణ మండిపడ్డారు. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ప్రధాని మోదీ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తక్షణమే అమెరికా సామ్రాజ్యవాద విధానాలను మోదీ వ్యతిరేకించాలని సూచించారు.