హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ ఈనెల 10న రాష్ర్టానికి విచ్చేయనున్న సందర్భంగా పెండింగ్‌లోని రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. గురువారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూంభవన్‌లో రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్యపద్మ, కలవేన శంకర్, వీఎస్ బోస్‌లతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ పర్యటనలో అభివృద్ధి పనులే కాకుండా, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో చేపట్టనున్న ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ (సర్)పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాథమిక సహకార సంఘాల పాలకమండళ్లను నామినేటెడ్ పద్ధతిలో నియమించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనకి తీసుకోవాలని కోరారు. వరి, మక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఈనెల 2న, పెట్రోల్, డీజిల్ కొరతను నిరసిస్తూ 4న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు వెల్లడించారు.