హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : లంచాలు, కమీషన్లు దండుకునేందుకే రెండు తెలుగు రాష్ర్టాల్లో 22ఏ నిషేధిత భూముల జాబితా తీసుకొచ్చారని సీపీఐ సీనియర్ నేత కే నారాయణ ఆరోపించారు. కొందరు తమ స్వార్థం కోసం దీనిని దుర్వినియోగం చేస్తున్నట్టు పేర్కొన్నారు.
శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల ఆస్తులను ఈ జాబితాలో పెట్టడంతో యజమానులు వాటిని అమ్ముకొనేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ తప్పిదాలతో భూ యజమానులే లంచాలు ఇచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. తెలుగు రాష్ర్టాల్లో లంచాల విషయంలో ఎలాంటి మార్పు రాలేదనిన్నారు. రాష్ట్రంలో పెద్ద ఆస్తులు మంత్రులపరం అవుతున్నాయని ఆరోపించారు.
కాంగ్రెస్లో నాయకుల మధ్య ‘సవతుల పోరు’ నడుస్తున్నదని నారాయణ విమర్శించారు. ఈ అంతర్గత కలహాల కారణంగా తెలంగాణలో బీజేపీ బలపడే అవకాశం ఉన్నదని హెచ్చరించారు. బీజేపీ బలపడిందంటే అందుకు కాంగ్రెస్ చేస్తున్న తప్పులే కారణమని పేర్కొన్నారు.