హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని టీజీపీఎస్సీని హైకోర్టు ఆదేశించడం సంతోషకరమని, గ్రూప్-1లో అవకతవకలు జరిగాయన్న అభ్యర్థులు, బీఆర్ఎస్ వాదనకు కోర్టు ఉత్తర్వులతో బలం చేకూరిందని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి పేర్కొన్నారు. తుది తీర్పు వెలువరించేవరకు నియామకాలను చేపట్టవద్దని ధర్మాసనం ఆదేశించడం రేవంత్ సర్కారుకు చెంపపెట్టు అని గురువారం ఓ ప్రకటనలో అభివర్ణించారు. అంతిమ విజయం ధర్మానిదేనన్న విషయం మరోసారి నిరూపితమైందని, ఇది అభ్యర్థులు సాగించిన ఉద్యమానికి అండగా నిలిచిన బీఆర్ఎస్ నైతిక విజయమని తెలిపారు.
అక్రమాలు జరిగాయని తాను ఆధారాలతో బయటపెడితే బెదిరింపులకు దిగిన టీజీపీఎస్సీ బండారం హైకోర్టు తీర్పుతో బట్టబయలైందని విమర్శించారు. 16 నెలల కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయాన్ని బీఆర్ఎస్ మొదటి నుంచీ ఎండగడుతున్న విషయాన్ని గుర్తుచేశారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులే తమవారికి ఉద్యోగాలిప్పించుకొనే విషయంపై చర్చించుకుంటున్నారు. శ్రీధర్‌బాబు, కొండా సురేఖ మాటామంతి అభ్యర్థుల్లో మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నది. ఇదే పద్ధతిలో గ్రూప్-1 ఫలితాలు వచ్చినయ్’ అని ధ్వజమెత్తారు. న్యాయం జరిగేదాకా అభ్యర్థులతో కలిసి బీఆర్ఎస్ అలుపెరగని పోరాటం చేస్తుందని స్పష్టంచేశారు.