CM KCR | ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 26: భారత రాష్ట్ర సమితి పేరు దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ ప్రతిధ్వనిస్తున్నది. దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తున్న పార్టీలు చేతకాక వదిలేసిన సమస్యలను పరిష్కరించే సత్తా బీఆర్ఎస్కే ఉన్నదన్న నమ్మకం సామాన్యుల్లోనూ పాదుకొంటున్నది. అందుకే ఎక్కడో మహారాష్ట్రలోని విదర్భలో మారుమూలన ఉన్న ఓ జంట బాబారావు, శోభమస్కీ దంపతులు ఒంటిపై సంకెళ్లతో కేసీఆర్ రావాలి.. సంకెళ్లు తెంచాలన్న బ్యానర్ చేతపట్టి హైదరాబాద్ వైపు పాదయాత్రగా సాగుతున్నారు.
రానున్న కాలంలో దేశంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని, తమ కష్టాలకు విముక్తి కల్పించాలని మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా రాజురా నియోజకవర్గానికి చెందిన బాబారావు, శోభ మస్కీ దంపతులు ఆకాంక్షించారు. విదర్భను వేరు చేయాలనే డిమాండ్‌తో పాటు తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలంటే బీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత ఉందని ఆకాంక్షిస్తూ రాజురా నుంచి హైదరాబాద్ వరకు చేపట్టిన పాదయాత్ర ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ మేరకు ఆదిలాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యాత్ర వివరాలను వెల్లడించారు. తాము సీఎం కేసీఆర్ అభిమానులమని, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ విదర్భ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేపట్టి, సీఎం కేసీఆర్‌ను కలిశానని బాబారావు గుర్తు చేసుకున్నారు. సీఎం కేసీఆర్‌ను కలిసి తమ ఆకాంక్షలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. దేశానికి కేసీఆర్ వంటి నాయకుడి అవసరం ఎంతో ఉన్నదని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో చేరి, కేసీఆర్ ఆనుమతితో మహారాష్ట్రతోపాటు దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.