ఆదిలాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం కేసీఆర్ ప్రధాని అయితే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం నిర్మల్ జిల్లా సోన్ మండలం కుచన్‌పల్లిలో 30 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ పథకాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయని చెప్పారు. సరిహద్దు రాష్ర్టాలు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రజలు మన పథకాలను ప్రశంసిస్తున్నారని గుర్తుచేశారు. అవాకులు, చెవాకులు పేలుతున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ పథకాలు ఎందుకు అమలు కావడం లేదో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. హరితహారం కారణంగా రాష్ట్రంలో 7 శాతం పచ్చదనం పెరిగిందని వెల్లడించారు. ఏప్రిల్ నుంచి సొంతభూమి ఉన్న పేదలకు డబుల్బెడ్రూం ఇండ్లను మంజూరు చేస్తుందని పేర్కొన్నారు.