Madhusudhana Chary | సీఎం రేవంత్రెడ్డి కాస్కో అంటూ శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. కేసీఆర్ మౌనం.. దాని పర్యావసానం గురించి వైఎస్సార్, చంద్రబాబుకు తెలుసునని.. రాబోయే రోజుల్లో కేసీఆర్ ధాటికి రేవంత్రెడ్డి చుగురుటాకులా వణికిపోవడం ఖాయమన్నారు. కుల గణనపై అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టం తెస్తారని అనుకున్నామని.. తూ తూ మంత్రంగా ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని ఆయన పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ కడియం శ్రీహరికి ప్రాధాన్యత ఇచ్చి డిప్యూటీ సీఎం పదవి ఇస్తే.. పార్టీకి మోసం చేశాడని మండిపడ్డారు. దమ్ము, ఆత్మ విశ్వాసం ఉంటే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మళ్లీ పూర్తిస్థాయిలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ మాట్రలాడుతూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాల్సిందేనన్నారు. తూ తూ మంత్రంగా కుల గణనను కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని.. విమర్శించారు. బీఆర్ఎస్ ఒత్తికి దిగివచ్చిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చిందని.. రీ సర్వే ఘనత బీఆర్ఎస్దేనన్నారు. గుడిసె వాసులకు పార్టీ అండగా ఉంటుందన్నారు.