నందికొండ, జూలై 7 : దేశంలో వరసగా జరుగుతున్న రైలు ప్రమాదాలు ప్రధాని మోదీ అసమర్థ పాలనకు నిదర్శనమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నందికొండ హిల్ కాలనీలోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుతో కలసి మాట్లాడారు. ఇటీవల జరిగిని ఒడిశా రైలు ప్రమాదంలో ప్రజలను భయబ్రాంతులను చేసిందని, 300 మంది ప్రాణాలను కేంద్రం పొట్టన పెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అది మరవక ముందే ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలు అగ్ని ప్రమాదం జరగడం దురదుష్టకరమని, కేంద్రం నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. కేంద్రంలో ఉన్న సీబీఐ, ఈడీలతో రాష్ట్రాలలో తమకు అనుకూలంగా లేని ప్రభుత్వాలను కూల్చే దిశగా కేంద్రం కుట్రలు పన్నుతుందని, కేంద్రం తీరుతో రాజకీయం, అధికారయంత్రాగం, న్యాయవ్యవస్థపై ప్రజలలో అపనమ్మకం ఏర్పడుతుందన్నారు.
గతం 60 ఏండ్ల పాలనలో నాటి ప్రభుత్వాలు 57 లక్షల కోట్లు అప్పులు చేయగా 9 ఏండ్ల పాలనలో బీజేపి ప్రభుత్వం 100 లక్షల కోట్ల అప్పులను చేసిందని, కేంద్రంలో ఉన్న బీజేపి ప్రభుత్వం పాలనలో జీడీపీ బాగా పడిపోయిందన్నారు. ప్రపంచ మార్కె ట్లో క్రూడ్ అయిల్ ధరలు తగ్గినా మన దేశంలో ప్రెటోల్ రేట్లు తగ్గలేదన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపి పాలనలో రూపాయి విలువ విదేశీయ మార్కెట్లో బాగా పడిపోయిదని, దేశంలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని మండిపడ్డారు.
బీఆర్ఎస్ లౌకిక పార్టీ అని మతతత్వ పార్టీ బీజేపితో కలసి ఎన్నికల్లో పోటీ చేయదన్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపి గ్రాఫ్ పడిపోయిదని, అందుకు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడుని మార్చుకుందన్నారు. రానున్న రోజుల్లో ప్రజలే బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని, ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వానికే పట్టంకడుతారన్నారు.