చిన్న చిన్న కాంట్రాక్టర్లు లక్షలకు లక్షలు అప్పులు చేసి పనులు చేయిస్తే, బిల్లులు సకాలంలో రాకుంటే వారి పరిస్థితేంది? సీఎం, డిప్యూటీ సీఎంకు చెప్పినా పరిస్థితి మారలేదంటే ఇంకెవరితో మొరపెట్టుకోవాలె? ఇంత దయనీయమైన స్థితి ఉంటదా?
హైదరాబాద్, జనవరి 6(నమస్తే తెలంగాణ) : ‘నా ఊరిలోనే దారుణమైన పరిస్థితి ఉన్నది. మన ఊరు-మనబడి పథకం కింద చేసిన పనులకు బిల్లులు లేక కాంట్రాక్టర్ చేతులెత్తేసిండు. పిల్లల ఇబ్బందులు చూడలేక, కాంట్రాక్టర్ అవస్థలు కాదనలేక బిల్లులొచ్చిన తర్వాత ఇవ్వమని స్వయంగా నేనే రూ.5 లక్షలు ఇచ్చి పనులు చేయించమని చెప్పిన. చిన్నచిన్న కాంట్రాక్టర్లు లక్షలకు లక్షలు అప్పులు చేసి పనులు చేయిస్తే, బిల్లులు సకాలంలో విడుదల కాకుంటే పరిస్థితి ఏంటి? ఈ విషయమై సీఎం, డిప్యూటీ సీఎంకు చెప్పినా పరిస్థితి మారలేదంటే ఇంకెవరితో మొరపెట్టుకోవాలి.. ఇంత దయనీయమైన స్థితి ఉంటుందా..’ అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కాంగ్రెస్ సర్కార్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బకాయిల విడుదల విషయంలో రేవంత్ ప్రభుత్వ తీరు, పథకాల అమల్లో నిర్లక్ష్యంపై తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు.
కాంగ్రెస్ సర్కార్‌కు శాసనమండలిలో వరుస షాక్‌లు తగులుతున్నాయి. మండలిలో సాక్షాత్తు చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. రోజూ ఏదో ఒక సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మంత్రులు చెప్పే సమాధానాలు తప్పులని ముఖం మీదే చెప్తున్నారు. సోమవారం విద్యుత్, ట్రాన్స్ఫార్మర్ల సమస్యలు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ముందే ప్రస్తావిస్తూ, ఆ పరిస్థితులు మరెక్కడో కాదు తన సొంత గ్రామంలోనే అంటూ నిలదీసినంత పనిచేయగా తెల్లబోవటం డిప్యూటీ సీఎం భట్టి పనైంది. అది మరువక ముందే మంగళవారం మరోసారి మన ఊరు-మన బడి బిల్లుల బకాయిలపై గుత్తా ప్రభుత్వాన్ని నిలదీయటంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మంగళవారం శాసనమండలిలో పలువురు సభ్యులు మన ఊరు- మన బడి బకాయిలపై ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మన ఊరు – మన బడి పథకానికి రూ.360 కోట్ల బకాయిలున్నాయని స్వయంగా వెల్లడిస్తూనే ఇందుకు సొంతూరు పరిస్థితినే ఉదహరించారు. ‘ఉదాహరణకు నా గ్రామమే చెబుతున్నా.. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ సగం పనులు చేసి ఆపేశారు.. అసలే చలికాలం పిల్లలు చెట్లకింద ఎలా కూర్చుంటారో చెప్పండి..’ అని ప్రశ్నించారు. బిల్లుల కోసం ఏడాది నుంచి చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, ప్రిన్సిపల్ సెక్రటరీకి స్వయంగా లేఖ రాశానని గుర్తు చేశారు. విషయాన్ని డిప్యూటీ సీఎం, సీఎంకు కూడా చెప్పానని, అయినా బిల్లులు రాలేదని అసహనం వ్యక్తం చేశారు. ఒకదశలో ‘దయచేసి’ అంటూ వేడుకున్నంత పని చేశారు. పనులు చేసిన వాళ్లంతా చిన్న కాంట్రాక్టర్లని, అప్పులు చేసి పనులు చేసి బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారంటూ ఆవేదన వెలిబుచ్చారు. తన ఊరిలోనే రూ.20 లక్షల బకాయిలు ఉన్నాయని, కాంట్రాక్టర్ బాధచూడలేక బిల్లు వచ్చిన తర్వాత ఇవ్వమని స్వయంగా రూ.5 లక్షలు ఇచ్చానని, దయచేసి మన ఊరు-మన బడి బకాయిలు చెల్లించండి.. అని చైర్మన్ అభ్యర్థించారు.
ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు లేక డ్రాపౌట్స్ పెరిగాయని తెలిపారు. 2024-25 సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలల్లో 36 లక్షల మంది విద్యార్థులుంటే, సర్కార్ బడుల్లో కేవలం 18.5 లక్షల మందే ఉన్నారని చెప్పారు. ఈ సంవత్సరం 3 లక్షల మంది చేరారని చెప్పడం అబద్ధమని, కనీసం 30వేల మంది కూడా చేరలేదని కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలలను మైనింగ్ సెస్‌కు అటాచ్ చేసిందని, సెస్ వచ్చే చోట నిధులు విడుదల చేస్తున్నారని, కొన్నిచోట్ల ఆ నిధులూ ఆగిపోయాయని గుత్తా సుఖేందర్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.