చౌటుప్పల్: అనాలోచిత నిర్ణయాలతో కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులు పెడుతున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. గతంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేసి దేశ ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. రూ.2000 నోటును తెచ్చిన బీజేపీ (BJP) ప్రభుత్వం దానిని రద్దు చేయడం తుగ్లక్ పాలనలా ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో సాయి మంచికంటి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అర్ధంపర్థం లేకుండా రూ.2 వేల నోట్లను రద్దుచేసి ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశంలో ప్రజలను ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరైన ఆలోచనలు చేయాలని సూచించారు.