హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : కొనుగోలు కేంద్రాలకు రైతులు నేరుగా తీసుకొచ్చిన పత్తిని తేమ, నాణ్యత పేరుతో కొర్రీలు పెట్టి తిరస్కరిస్తున్న అధికారులు.. అదే పత్తిని రైతుల పేరుతో వ్యాపారులు తీసుకెళ్తే మాత్రం కండ్లకు అద్దుకుని కొనుగోలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు కుమ్మక్కై పత్తి రైతులను నిండా ముంచుతున్నారనే విమర్శలొస్తున్నాయి. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పత్తి దెబ్బతిన్నది. నిబంధనల ప్రకారం తేమ, నాణ్యత రావడం గగనంగా మారింది. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సడలింపులు ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం అందుకు ససేమిరా అంటున్నది. నిబంధనల ప్రకారం 12% తేమ ఉంటేనే పత్తి కొనుగోలు చేస్తామని సీసీఐ అధికారులు రైతులతో తెగేసి చెప్తున్నారు.
అయితే, అదే పత్తిని రైతుల పేర్లతో వ్యాపారులు తీసుకెళ్తే మాత్రం ఎలాంటి కొర్రీలు పెట్టడంలేదని తెలిసింది. రైతులు తమ పత్తిని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే.. తేమ 12% కన్నా ఎక్కువగా ఉన్నదని, రంగు మారిందని, గింజ పొడవు లేదంటూ నానా రకాల కొర్రీలు పెడుతూ. దానిని తీసుకొనేందుకు నిరాకరిస్తున్నట్టు తెలిసింది. దీంతో రైతులు సీసీఐ నిబంధనలతో వేగలేక.. పత్తిని అలాగే ఉంచుకోలేక ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. మద్దతు ధర రూ.8,110 ఉండగా.. ప్రైవేటు వ్యాపారులు రూ.6-7వేలలోపు ధర మాత్రమే ఇస్తున్నట్టు తెలిసింది. ప్రైవేటు వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తిని వీలైతే అదే రైతుల పేరుతో, లేదంటే తమకు అనుకూలంగా ఉండే రైతుల పేరుతో తిరిగి సీసీఐకి విక్రయిస్తున్నట్టు తెలిసింది. రైతులు తెచ్చినప్పుడు తిరస్కరించిన పత్తిని ప్రైవేటు వ్యాపారులు తీసుకొస్తే మాత్రం ఎలాంటి కొర్రీలు లేకుండా మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నట్టు తెలిసింది.
నిరుడు సీసీఐ పత్తి కొనుగోళ్లలో భారీగా అవకతవకలు జరిగినట్టు ప్రభుత్వం గుర్తించింది. సీసీఐ అధికారులు, వ్యాపారులు, జిన్నింగ్ మిల్లులు, వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెటింగ్ కార్యదర్శులు కలిసి భారీ కుంభకోణానికి పాల్పడినట్టు తేల్చింది. ఇందుకు బాధ్యులుగా గుర్తించి ఎనిమిది మంది మార్కెటింగ్ కార్యదర్శులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) పేరుతో, తేమ పేరుతో ఈ కుంభకోణానికి పాల్పడ్డట్టు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు కూడా ఆదేశించింది. ఏఈవోలు జారీచేసే టీఆర్‌లను ఆసరగా చేసుకొని కార్యదర్శులు, వ్యాపారులు, మిల్లర్లు.. రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తిని దొడ్డిదారిలో సీసీఐకి మద్దతు ధరకు విక్రయించినట్టు గుర్తించారు. ఈ విధంగా సుమారు 54 వేల టీఆర్‌లు జారీచేసినట్టు తేల్చారు. అయితే, ఇప్పుడు టీఆర్‌ల జారీని ఆన్లైన్ చేయడంతో దందాకు కొత్త దారిని ఎంచుకున్నట్టు తెలిసింది. రైతులు తెచ్చిన పత్తికి కొర్రీలు పెట్టి కొనకుండా చేసి, ఆ పత్తిని వ్యాపారులతో కొనుగోలు చేయించి ఆ తర్వాత అదే పత్తిని మద్దతు ధరకు సీసీఐకి విక్రయించేలా తెరవెనుక తతంగం నడుపుతున్నట్టు ఆరోపణలొస్తున్నాయి.
క్షేత్రస్థాయిలో వ్యాపారులు, జిన్నింగ్ మిల్లులు కుమ్మక్కై అవకతవకలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇందులో సీసీఐ అధికారులను సైతం భాగస్వామ్యం చేస్తున్నట్టు తెలిసింది. రైతులు తీసుకొచ్చిన పత్తికి కొర్రీలు పెడుతూ, తేమ శాతం ఎక్కువ ఉన్నదని, నాణ్యత సరిగా లేదంటూ ఆ పత్తిని తీసుకునేందుకు జిన్నింగ్ మిల్లులు నిరాకరిస్తూ.. అదే పత్తిని వ్యాపారులు తీసుకొస్తే మాత్రం ఎలాంటి కొర్రీలు లేకుండా గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నట్టు తెలిసింది. సీసీఐ అధికారులను సైతం మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి క్వింటాల్‌పై కనీసంగా రూ.1,500 లాభంగా తీసుకుంటున్నట్టు తెలిసింది. ఈ విధంగా వచ్చిన లాభంలో వ్యాపారులు, మిల్లర్లు, సీసీఐ అధికారులు పర్సంటేజీలుగా పంచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.