కరీంనగర్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఆదిలాబాద్/జమ్మికుంట: పాలకుల నిర్లక్ష్యం పత్తి రైతుల పాలిట శాపంగా మారింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కి విక్రయించి మద్దతు ధర పొందుదామనుకున్న పత్తిరైతుల ఆశలపై ప్రభుత్వాలే నీళ్లు చల్లుతున్నాయి. 10 రోజులుగా సీసీఐ కేంద్రాల వద్ద పత్తి కొనుగోళ్లు నిలిచిపోయినా పట్టింపులేకుండా పాలకులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఆధార్ సర్వర్‌లో సాంకేతిక సమస్యతోనే కొనుగోళ్లు చేయడం లేదని సీసీఐ, మార్కెటింగ్‌శాఖ అధికారులు చెప్తున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా కొనుగోళ్లు చేపట్టే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడమే లేదు. దీంతో ఇప్పటికే సీసీఐ కేంద్రాల్లో లక్షలాది క్వింటాళ్ల పత్తి నిల్వలు ఉండగా, వేలాది మంది పడిగాపులు కాస్తున్నారు. ఈ సమస్య తెలిసి ఎందరో రైతులు ఇండ్లల్లోనే పత్తిని నిల్వ చేసి, సీసీఐ కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభమవుతాయోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇదే అదనుగా దళారులు జొరబడి తక్కువ ధరకే కొంటూ అందిన కాడికి దోచుకుంటున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు తెగనమ్ముకొని నష్టపోతున్నారు. అంతా తెలిసినా రాష్ట్ర సర్కారు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంపై సర్వాత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
10 రోజులుగా కొనుగోళ్లు బంద్
సీసీఐ కొనుగోల కేంద్రాల్లో క్వింటా పత్తికి రూ.7,521 మద్దతు ధరతో ప్రకటించి కొనుగోళ్లు ప్రారంభించారు. నిబంధనలకు లోబడి సీసీఐ కేంద్రాల్లో అమ్మకానికి రైతులు లక్షలాది క్వింటాళ్ల తమ పత్తి దిగుబడులను తరలించారు. ఆధార్ సర్వర్ డౌన్ అయిందంటూ, రైతు వివరాలు అధార్‌తో అనుసంధానం కాలేదని పేర్కొంటూ, రాష్ట్రంలోని అన్ని సీసీఐ కేంద్రాల వద్ద గత 10 రోజులుగా కొనుగోళ్లను నిలిపివేశారు. దీంతో వేలాది మంది రైతులు కోనుగోలు కేంద్రాల్లోనే ఉండి పడిగావులు పడుతున్నారు. ఇంకా వేలాది మంది తమ నిల్వలను మార్కెట్‌కు తెలేక.. ఇంట్లో ఉంచుకోలేక సీసీఐ ఎప్పుడు కొనుగోలు ప్రారంభిస్తుందా? అని ఆశతో ఎదురుచూస్తున్నారు.
పత్తి రైతుల గోడు పట్టించుకోని సర్కార్
ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పత్తిని కొనుగోలు చేసే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోడం లేదు. కేంద్రంతో మాట్లాడి అధార్ సర్వర్ సమస్యలు తీరేలా కనీసం చొరవ చూపడం లేదు. సీసీఐ, మార్కెటింగ్ అధికారులతో ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా నిబంధనల ప్రకారం పత్తి కొనుగోలు చేసి, సంబంధిత రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సేకరించిన పత్తిని అక్కడే కేంద్రాల వద్ద నిల్వచేసి.. సర్వర్ సమస్య తీరిన తర్వాత వివరాలు నమోదు చేసుకునే వెసులుబాటును కేంద్రం నుంచి పొందడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉంటుందని అంటున్నారు.
పక్క ఫొటోలోని రైతు పేరు చెవుల మల్లయ్య. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం గడ్డివానిపల్లి గ్రామం. రెండెకరాల్లో పండిన 18 క్వింటాళ్ల పత్తి 10 రోజుల క్రితం జమ్మికుంటలోని సీసీఐ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. పత్తి బాగుందని చెప్పిన సీసీఐ అధికారులు ఆధార్‌లో సాంకేతిక సమస్య వచ్చిందని, ఇప్పుడు కొనుగోలు చేయడం సాధ్యపడదంటూ తేల్చిచెప్పారు. దీంతో 10 రోజులుగా పత్తి బస్తాలతో సీసీఐ కేంద్రంలోనే పడిగావులు పడుతున్నాడు. ఒక దశలో ప్రైవేట్‌కు అమ్ముదామని ప్రయత్నిస్తే రూ.5,600కు మాత్రమే అడగడంతో వద్దనుకున్నాడు. నిత్యం సీసీఐ, మార్కెట్ అధికారుల చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతున్నాడు. అధికారుల పిలుపు కోసం వేచి చూస్తూ ఆ రైతు పడుతున్న అవస్థ వర్ణనాతీతం.
ఉన్నతాధికారులకు నివేదిక పంపినం
సీసీఐ ప్రస్తుతం కొనుగోళ్లు నిలిపివేసిన మాట నిజమే. ఆధార్‌లో సాంకేతిక సమ స్య వచ్చింది. రైతుల కు ఓటీపీ వస్తేనే సీసీఐ కొనుగోళ్లు చేస్తుంది. అందుకే కొద్ది రోజులుగా కొంటలేదు. ఈ సమస్యపై ఉన్నతాధికారులకు నివేదిక పంపినం. ఇదే సమస్య రాష్ట్రం మొత్తంలో ఉన్నది. . సమస్య పరిష్కారమైతే మళ్లీ సీసీఐ మద్దతు ధరతో పత్తి కొంటది.
– మల్లేశం, ప్రథమ శ్రేణి కార్యదర్శి,జమ్మికుంట మార్కెట్