(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని మోదీ (PM Modi) ప్రభుత్వ పాలనలో రైతన్న (Farmers) అరిగోస పడుతున్నాడు. పశ్చిమ దేశాల ఒత్తిళ్లకు తలొగ్గుతూ ప్రధాని మోదీ తీసుకొంటున్న ఏకపక్ష నిర్ణయాలు దేశీయ కర్షకుల ఉసురు తీస్తున్నది. ముఖ్యంగా బీజేపీ (BJP) పాలనలో పత్తి రైతులు గతంలో ఎన్నడూ చూడనటువంటి దుర్భర పరిస్థితులను ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది పత్తి రైతులపై కాలంతోపాటు కేంద్రం కూడా పగబట్టినట్టే కనిపిస్తున్నది. అధిక వర్షాలకు ఒకవైపు పత్తి పంట నాశనమై మెజారిటీ రైతులు తీవ్రంగా నష్టపోతే.. మిగిలిన ఆ కొంత పత్తినైనా అమ్ముకుందామనుకొన్న అన్నదాతకు కేంద్రం తీసుకొన్న అనాలోచిత నిర్ణయాలు, కొత్త నిబంధనలు శరాఘాతంగా మారాయి. పత్తి దిగుమతులపై ఇప్పటివరకూ ఉన్న 11 శాతం సుంకాన్ని డిసెంబర్ 31వ తేదీ వరకూ కేంద్రం ఎత్తివేసింది.
రైతు చేతికి పత్తి వచ్చే కీలక సమయం ఇది. ఇలాంటి సమయంలో విదేశాల నుంచి తక్కువ ధరకే పత్తి దిగుమతులకు కేంద్రం తలుపులు బార్లా తెరువడంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పత్తిపై సుంకాలు ఎత్తేయడంతో వస్త్ర తయారీ పరిశ్రమలు, వ్యాపారులు.. అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, చైనా తదితర దేశాల నుంచి వచ్చే చౌకైన పత్తిని పెద్దయెత్తున కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఇక్కడి రైతులు పండించిన పత్తిని కొనేవాళ్లు కరువైపోయారు. ఇదే అదునుగా.. విదేశీ పత్తి కంటే తక్కువ ధరకు విక్రయిస్తేనే.. కొంటామంటూ పత్తి రైతులపై కొందరు దళారులు ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. పత్తికి కేంద్రం నిర్ణయించిన మద్దతు ధర రూ. 8,110 కాకుండా రూ. 2 వేల వరకూ కోత పెడుతున్నారు. ఫలితంగా చేసేదేమీ లేక నష్టాలకే రైతులు తెల్ల బంగారాన్ని అగ్గువకు అమ్ముకొని అప్పులపాలవుతున్నారు.
సుంకాల ఎత్తివేతతో పత్తి రైతులకు కొత్త కష్టాలు తీసుకొచ్చిన కేంద్రం.. పత్తి కొనుగోళ్లలో ‘కపాస్ కిసాన్’ పేరిట కొత్త యాప్‌ను ప్రవేశపెట్టి మరో ఇబ్బందికి తెరతీసింది. ఈ సీజన్లో పత్తి కొనుగోళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ‘కపాస్ కిసాన్’ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పత్తి పంట సాగు చేసిన రైతులు ఈ యాప్‌లో ఎన్రోల్, స్లాట్ బుకింగ్‌ను తప్పనిసరిగా చేసుకోవాలని రూల్స్ తీసుకొచ్చింది. ఆ విధంగా నమోదు చేసుకున్న రైతుల పత్తిని మాత్రమే సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోలు చేస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వ కొత్త విధానంపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. సుంకాలతో తమ నోటికాడి బువ్వను ఎత్తుకెళ్లిన కేంద్రం.. ఇప్పుడు ఈ నిబంధనతో చదువు రాని, స్మార్ట్‌ఫోన్ లేని తమను అవమానిస్తున్నదని రైతులు మండిపడుతున్నారు. రైతులకు ఈ కొత్త నిబంధనలు పెట్టడం ఏమిటని నిలదీస్తున్నారు.
ఒకవేళ ‘కపాస్ కిసాన్’ యాప్‌లో రైతన్న కష్టాలు పడి స్లాట్ బుకింగ్ చేసుకున్నా.. పత్తి కొనుగోళ్లలోనూ కేంద్రం పరిమితులను విధించింది. ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తినే కొంటామంటూ సీసీఐ నిబంధనల్లో పేర్కొంది. గతంలో రైతు ఎంత పత్తిని సీసీఐకు తీసుకొచ్చినప్పటికీ కొనుగోలు చేసేవారు. అయితే, ఈ సీజన్ ప్రారంభానికి ముందు ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అందుకు తగ్గట్టే రైతులు పత్తి పంటను సాగు చేశారు. తీరా దిగుబడి వచ్చాక ఇప్పుడు 12 క్వింటాళ్లకు బదులు ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేస్తామని సీసీఐ అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీ ప్రకారం పూర్తి స్థాయిలో పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు.
ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా అతివృష్టితో ఈసారి పత్తిలో తేమ శాతం పెరిగింది. అయితే, 8 నుంచి 12 శాతం తేమ ఉంటేనే పత్తిని కొంటామని సీసీఐ మరో నిబంధన పెట్టడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు, ఇతరత్రా కారణాలతో పత్తిలో తేమ 18 శాతం నుంచి 25 శాతం వరకూ నమోదవుతున్నదని, ఇలాంటి సమయంలో 8 శాతం తేమ ఉంటేనే కొనుగోళ్లు చేపడుతామని చెప్పడం ఏమిటని మండిపడుతున్నారు. ఓ వైపు పత్తి రైతులకు మద్దతు ధర కల్పిస్తున్నామని, రైతులు పండించిన పంటను పూర్తిగా కొనుగోలు చేసి వారికి చేయూత అందిస్తున్నామని ప్రచారం చేసుకొంటున్న కేంద్రం.. క్షేత్రస్థాయిలో మాత్రం కఠిన నిబంధనలు అమలు చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నదని వ్యవసాయ నిపుణులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా కేంద్రం తన ఏకపక్ష చర్యలను పక్కనబెట్టి పత్తి రైతును ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
దిగుమతి సుంకాలను ఎత్తేయడం అంటే దేశీయ పత్తి రైతులను దెబ్బకొట్టడమే. ‘కపాస్ కిసాన్’ యాప్‌తో కొత్త సమస్యలు వస్తున్నాయి. ప్రభుత్వ చర్యలతో జిన్నింగ్ మిల్లులు మూతబడే పరిస్థితి వచ్చింది.
– బీ రవీందర్ రెడ్డి, తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు
పత్తి దిగుమతులపై సుంకాల ఎత్తివేత నిర్ణయం దేశీయ పత్తి రైతుల జీవితాలను చిదిమేయడమే. కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం. నిరసనలు ఉద్ధృతం కాకముందే ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి.
– ఇంద్రజిత్ సింగ్, సంయుక్త కిసాన్ మోర్చా నేత