ఆదిలాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో పత్తి రైతులు గురువారం ఆందోళన చేపట్టారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి ధర రూ.50 తగ్గించడంపై వారు జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.
రైతుబంధు, రూ.2 లక్షల రుణమాఫీ వర్తించక ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నామని, పత్తి ధర తగ్గడంతో ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. పెట్టుబడులు, కూలీల ధరలు బాగా పెరిగాయని, అకాల వర్షాలతో దిగుబడులు తగ్గాయని, ధర తగ్గడంతో తమ పరిస్థితి మరింత అధ్వానంగా తయారైందని అన్నారు. సీసీఐ అధికారులు పత్తి ధర తగ్గించకుండా చూడాలని కోరారు.
నేను 11 ఎకరాల్లో పత్తి సాగు చేశా. ఎకరాకు పది క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇప్పటివరకు 48 క్వింటాళ్ల పంట అమ్మిన. ఇంకా 50 క్వింటాళ్ల పంట చేనులో ఉన్నది. కూలీల కొరత కారణంగా పంట తీయడంలో జాప్యం అవుతుంది. మండలంలో రైతులు ఇంకా సగం పంట కూడా విక్రయించలేదు. మద్దతు ధర క్వింటాల్‌కు రూ.7,521 ప్రకటించిన సీసీఐ అధికారులు రూ.50 తగ్గించడం అన్యాయం. సీసీఐ నిర్ణయంతో మేం భారీగా నష్టపోతున్నాం.
– సంతోష్, రైతు, దహిగాం, బేల మండలం, ఆదిలాబాద్