 
                                                            
‘అయ్యో దేవుడా!.. మేం ఎట్ల బతకాలె? నేనేం చెయ్యాల్నో చెప్పు నాయనా! నిన్నటిదాన్క ఈడనే ఉన్న. నిన్న వడ్లు మంచిగనే ఉన్నయ్. మంచిగ నేర్పిన! తేమ కూడ మంచిగనే వచ్చింది. అయినా కొనలేదు. వాన పడి ఇప్పుడంత కొట్టుకుపోయిందిరా దేవుడా!.. నేనేం జెయ్యాలె’
– మహిళా రైతు కేడిక తారవ్వ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్)
హైదరాబాద్, అక్టోబర్ 30(నమస్తే తెలంగాణ): అకాల వర్షాలతో తడిసి ముద్దయిన పత్తి.. సగానికి సగం పడిపోయిన దిగుబడి.. 12% తేమ నిబంధనతో సీసీఐ (CCI) కొర్రీలు.. బహిరంగ మార్కెట్లో మద్దతు ధర దక్కని దైన్యం.. నేటికీ ప్రారంభంకాని కొనుగోలు కేంద్రాలు.. వెరసి… పత్తి రైతు గుండె కోతకు గురవుతున్నది. ప్రకృతి ప్రకోపానికి సర్కారు నిర్లక్ష్యం తోడైంది. దీంతో ఆరుగాలం కష్టం చేసి పండించిన పంట కండ్ల ముందే వర్షార్పణం అవుతున్నది. ఈ వానకాలం సీజన్ పత్తి రైతులకు ఏ మాత్రం కలిసిరాలేదు. పీడకలనే మిగిల్చింది. మొదట్లో వర్షాలులేక ఇబ్బందిపడిన రైతులు.. ఆ తర్వాత అధిక వర్షాలతో దెబ్బతింటున్నారు. చేతికొచ్చిన పత్తి పింజలు వర్షానికి తడిసి ముద్దవుతున్నాయి. దెబ్బ మీద దెబ్బలా గతంలో కురిసిన వర్షాలతో దిగుబడి తగ్గిపోగా, తాజా మొంథా తుపానుతో పంట పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది.
పత్తి కొనుగోళ్లను ఎంత వీలైతే అంత తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సీసీఐ ప్రయతిస్తున్నదనే విమర్శలొస్తున్నాయి. కొనుగోళ్లలో నానా కొర్రీలు పెడుతున్నది. 12% తేమ నిబంధనతో రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నదనే ఆరోపణలున్నాయి. నిబంధనల ప్రకారం 8-12% వరకు తేమ ఉంటేనే కొనుగోలు చేస్తామని సీసీఐ అధికారులు స్పష్టంచేస్తున్నారు. 12 శాతానికి ఏ మాత్రం ఎక్కువగా ఉన్నా పత్తి కొనుగోలును నిరాకరించి నిర్ధాక్షిణ్యంగా రైతులను వెనక్కి పంపిస్తున్నారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో పత్తి పూర్తిగా తడిసిపోతున్నది. రైతులు ఆరబెట్టినా సాధారణ తేమ శాతం రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తుండటం గమనార్హం. తేమ శాతాన్ని 20కి పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కానీ, సీసీఐ పట్టించుకోట్లేదు.
రాష్ట్రవ్యాప్తంగా పత్తి పంట ఏరడానికి సిద్ధంగా ఉన్నది. ఇదే సమయంలో వరణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. మొంథా తుపాను పత్తి పంటను పూర్తిగా నాశనంచేసింది. తెంపడానికి సిద్ధంగా ఉన్న పత్తి పూర్తిగా తడిసిపోయింది. నీళ్లలో నానబెట్టినట్టుగా తయారైంది. చెట్టుపై ఉన్న పత్తి నీళ్లకు తడిసి మొలకలొస్తుండటంతోపాటు నల్లబడిపోతున్నది. ఇప్పుడు ఆ పత్తిని తెంపినా ప్రయోజనంలేని పరిస్థితి నెలకొన్నది.
జూన్, జూలై నెలల్లో వర్షాలు లేకపోవడంతో పత్తి రైతులు తీవ్రంగా ఆందోళన చెందారు. ఈసారి తమకు నష్టం తప్పదనే అంచనాకు వచ్చారు. కానీ, ఆ తర్వాత కురిసిన వర్షాలతో రైతుల్లో సంతోషం నెలకొన్నది. ఆ సంతోషం చివరి వరకు లేకుండా పోయింది. పత్తి పింజలు పగిలిన తర్వాత కూడా వర్షాలు వీడలేదు. ప్రస్తుత వర్షాలు పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఈ సీజన్లో పత్తి దిగుబడి భారీగా తగ్గిపోయింది. ఎకరానికి 10-12 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి 4-6 క్వింటాళ్లకు పడిపోయింది. కనీసం అదైనా చేతికొస్తుందేమోనని ఆశ పడుతున్న వేళ మొంథా తుపాను విరుచుకుపడింది. చేతికొస్తున్న ఆ కాస్త పంట కూడా తాజా వర్షాలతో పూర్తిగా పాడైపోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు వర్షాలకు దిగుబడి తగ్గిపోయి నష్టాల్లో ఉన్న పత్తి రైతులపై కొనుగోళ్లలో నిర్లక్ష్యం మరింత నష్టం చేకూర్చుతున్నది. పత్తి కొనుగోలు చేస్తున్నామంటూ ఇటు సీసీఐ, అటు కాంగ్రెస్ సర్కారు ప్రకటనలే తప్ప క్షేత్రస్థాయిలో కాంటా పెట్టింది లేదు.. పత్తి కొనుగోళ్లు చేసిందీ లేదు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నా.. అవేవీ పట్టనట్టుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తుండటం గమనార్హం. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోలు కేంద్రాలనే ఏర్పాటు చేయలేదు. మొన్నటివరకు జిన్నింగ్ మిల్లులతో పంచాయితీతో సీసీఐ కొనుగోళ్లను ప్రారంభించలేదు. ఆ తర్వాత ఆ పంచాయితీ పరిష్కారమైనప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్ల కోసం 318 జిన్నింగ్ మిల్లులను ఎంపిక చేయగా, ఇప్పటివరకు 72 మిల్లుల్లోనే కొనుగోళ్లు ప్రారంభించడం గమనార్హం. ఈ సీజన్లో మొత్తం 25 లక్షల టన్నులు దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం 1,623 టన్నుల పత్తిని మాత్రమే కొనుగోలు చేయడం గమనార్హం.

ఆదిలాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పత్తిని అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం చెప్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. తేమ శాతం 8 ఉంటేనే మద్దతు ధరతో సీసీఐ కొనుగోలు చేస్తున్నది. రైతులు పంటను సీసీఐ కేంద్రాలకు తీసుకురాగా 12 శాతం కంటే ఎక్కువ తేమ వస్తున్నది. దీంతో పంటను కొనడం సాధ్యం కాదని చెప్తున్నారు. ప్రైవేటులో మద్దతు ధర కంటే క్వింటాల్‌కు రూ.1200 తక్కువతో ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో రైతులు సోమవారం తీసుకొచ్చిన పత్తిని గురువారం వరకు సీసీఐ అధికారులు తేమ ఎక్కువ ఉన్నదని కొనుగోలు చేయలేదు. దీంతో రైతులు నాలుగు రోజులుగా మార్కెట్ యార్డులో పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తేమ శాతం విషయంలో కొంత మినహాయింపు నివ్వాలని రైతులు కోరుతున్నారు.
 
                            