హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అత్యంత కీలకమైన వైద్యశాఖలో బదిలీల ప్రక్రియలో కొన్ని యూనియన్ల తీరు వివాదాస్పదంగా మారుతున్నది. కొంతమంది వైద్యులు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అపాయింట్మెంట్ పొంది, ఇక్కడే రిటైర్మెంట్ అవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. యూనియన్ ప్రయారిటీని సాకుగా చూపి ప్రతిసారి బదిలీల నుంచి మినహాయింపు పొందుతూ దర్జాగా ఉన్న చోటనే దశాబ్దాలుగా కొనసాగుతున్నారనే విమర్శలున్నాయి. ఏండ్లుగా కదలకుండా ఉన్న వారు గుర్తింపు సంఘంలో ఆఫీస్ బేరర్లు అయితే చాలు ఇక తమను ఎవరూ కదలించలేరనే ధీమాతో ఉన్నారు.
దీంతో కొందరు కొన్ని యూనియన్లను సంప్రదించి ఆఫీస్ బేరర్ల పోస్టులతోపాటు కొన్ని కీలక పదవులకు లేఖలను అడ్డదారిలో పొందుతున్నారు. ఇందుకు కొన్ని యూనియన్లు ఆయా పోస్టులకు రేటు ఫిక్స్ చేసి వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. ఒక్కో లేఖకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు కొంతమంది వైద్యులు, సిబ్బంది నుంచి యూనియన్ల నాయకులు వసూళ్లకు పాల్పడినట్టు తెలిసింది. వైద్యశాఖలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ (డీఎంఈ), డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (డీహెచ్), తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) తదితర విభాగాల్లో ఇలా వందల మంది యూనియన్ల నుంచి లేఖలు పొంది బదిలీల నుంచి తమను మినహాయించాలని ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిసింది. డబ్బులు చెల్లించాం, యూనియన్ల నుంచి లేఖలు పొందాం.. కానీ బదిలీ నుంచి మినహాయింపు వస్తుందో లేదో అని కొందరు తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్టు తెలిసింది.
ఉన్నతాధికారులను తమ దారిలోకి తెచ్చుకొని గతంలో ఎన్నడూ వైద్యశాఖలో బదిలీలకు కమిటీ వేయలేదని, ఈ సారి వేసినా.. ఆ కమిటీ సరిగ్గా పనిచేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఏసీ రూమ్లో కూర్చొని గైడ్లైన్స్ తయారు చేస్తే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా తెలుస్తాయి? అని ప్రశ్నిస్తున్నారు. బదిలీల్లో ఏండ్ల తరబడి హైదరాబాద్లో పాతుకుపోయిన వారిని వెంటనే బదిలీ చేయాలని పలువురు వైద్యులు, సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తయారు చేసిన నిబంధనలను అందరికీ ఒకేలా వర్తింపజేయాలని, వైద్యులతోపాటు ఇతర సిబ్బంది కోరుతున్నారు. కొన్ని యూనియన్లు ఉన్నతాధికారులకు డబ్బుల ఎర వేసి ఈ తంతును నడిపించినట్టు ఆరోపణలున్నాయి.
యూనియన్లు మినహాయింపు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేస్తామని సర్కార్ను బెదిరించి తమ పంతాన్ని నెగ్గించుకున్నాయని పలువురు మండిపడుతున్నారు. దీంతోపాటు సంఘాల నుంచి లేఖలు పొందినవారిని ట్రాన్స్ఫర్ల నుంచి మినహాయించవద్దని గ్రామీణ వైద్యులు, సిబ్బంది కోరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏండ్లుగా పనిచేస్తున్న తమకు ఈ సారైనా బదిలీల్లో న్యాయం జరుగుతుందని భావించామని కానీ కొంతమంది యూనియన్ల మాటున తమ అవకాశాలకు గండి కొడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొంతమంది యూనియన్ల పేరిట సాగిస్తున్న దందాతో ఇతర జిల్లాల్లో పనిచేసి, సీనియార్టీ ఉన్న హైదరాబాద్, పరిసర ప్రాంతాలకు రాని పరిస్థితి నెలకొందని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని పలువురు గ్రామీణ ప్రాంత వైద్యులు, సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.