హైదరాబాద్ : దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ మహానగరంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత GHMC కార్పొరేటర్ల పైనే ఉందని పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
బుధవారం తెలంగాణ భవన్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన నగరానికి చెందిన TRS పార్టీ MPలు, MLA, MLC లు, కార్పొరేటర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, MP రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, ఎగ్గే మల్లేశం, ఎంఎస్ ప్రభాకర్, MLA లు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, సుభాష్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, అరికేపూడి గాంధీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కార్పొరేటర్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో GHMC పరిధిలో కోట్లాది రూపాయల ఖర్చుతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. మరికొన్ని పనులు జరుగుతున్నాయని వివరించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాలలో అభివృద్ధిని సాధిస్తూ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు.
నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీని, ట్రాఫిక్ ను తట్టుకునేందుకు గాను నూతనంగా ఫ్లై ఓవర్ బ్రిడ్జి లు, అండర్ పాస్ ల నిర్మాణం, అనేక చోట్ల రహదారుల విస్తరణ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. వర్షాకాలంలో వచ్చే వరద ముంపును నివారించేలా పక్కా ప్రణాళికలతో అభివృద్ధి పనులను చేపట్టి ముందుకు వెళుతున్నట్లు వివరించారు.
మురికినీటి శుద్ధి కోసం సీవరేజీ ప్లాంట్ లను ఏర్పాటు చేసేందుకు ఒకేసారి 3 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా GHMC పరిధిలో తెలంగాణ ప్రభుత్వ హయాంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఈ నెల 18 వ తేదీన జరిగే GHMC జనరల్ బాడీ మీటింగ్ సమావేశం వేదికగా చేసుకొని ప్రజలకు వివరించాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ కార్పొరేటర్స్ కు పిలుపునిచ్చారు.
స్వచ్ఛ్ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా 4500 ఆటోల ద్వారా ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరిస్తున్నారని, దీనిని సమర్థవంతంగా నిర్వహించినందుకు గాను కేంద్ర ప్రభుత్వం రెండు అవార్డులను అందజేసిందని చెప్పారు. కార్పొరేటర్లు తమ డివిజన్ లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకే పరిమితం కాకుండా GHMC ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలపై పూర్తి అవగాహనను కలిగి ఉండాలని సూచించారు.
GHMC సమావేశంలో ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేస్తూ సమర్థవంతంగా తిప్పికొట్టాలన్నారు. GHMC పరిధిలోని కంటోన్మెంట్ లలో రహదారుల విస్తరణ చేయకపోవడం వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, రోడ్ల విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా ఎలాంటి స్పందనలేదని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ఈ నెల 18 వ తేదీన జరిగే సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాల పై 10 మంది కార్పొరేటర్ లతో ఒక సమన్వయ కమిటీ ని ఏర్పాటు చేశారు. భవిష్యత్ లో ప్రతి రెండు నెలలకు ఒకసారి MLA లు, కార్పొరేటర్ లు, అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎలా మాట్లాడాలి..ఏం మాట్లాడాలి అనే బెణుకును మనసులోంచి తీసివేయాలని నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లకు మంత్రి మల్లారెడ్డి, MP రంజిత్ రెడ్డి సూచించారు.
తాము పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన కొత్తలో ఇదే రకమైన పరిస్థితులను ఎదుర్కొన్నామని, పరిస్థితులను అవగాహన చేసుకుంటూ ముందుకు సాగామనిని వివరించారు. కార్పొరేటర్స్ గా ఎన్నికై సంవత్సరం పూర్తయిన సందర్భంగా కార్పొరేటర్ లకు సమావేశంలో పాల్గొన్న పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.