Harish Rao | కరోనా ప్రజల జీవితాల్లో అనేక మార్పులు తీసుకొచ్చిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆరోగ్యం పట్ల క్రమశిక్షణ ఉండాలని కరోనా ప్రపంచానికి నేర్పించిందని తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళా నిలయంలో జరిగిన మహిళా యోగా పోటీల కార్యక్రమానికి హరీశ్‌రావు ముఖ్యమంత్రిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. అభివృద్ధి అంటే నాలుగు కాలేజీలు, నాలుగు రోడ్లు, నాలుగు స్టేడియాలు కట్టడం కాదని.. ప్రజల జీవన ప్రమాణాలు మారాలని అన్నారు. ఆరోగ్య సిద్ధిపేటే..అభివృద్ధి సిద్ధిపేట అని వ్యాఖ్యానించారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే అది అభివృద్ధి అని తెలిపారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండటం కూడా అభివృద్ధిలో భాగమవ్వాలని కోరారు. ఆరోగ్యమే మహా భాగ్యమని పెద్దలు అన్నారని.. లక్షలు ఖర్చుపెట్టి హాస్పిటల్లో నయం చేసుకునే కన్నా స్వీయ క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.
పిల్లలు ఫిజికల్ గేమ్స్ ఆడటం మానేసి.. ఆన్లైన్ గేమ్స్ మొదలు పెట్టారని హరీశ్‌రావు అన్నారు. ఇవ్వాళ తల్లులు కూడా పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇస్తున్నారని.. పిల్లలకు అన్నం తినిపించడం ఈజీ అయ్యింది కానీ అది మంచిది కాదని హితవుపలికారు. యోగా మనలో మానసిక ఒత్తిడిని దూరం చేస్తుందని అన్నారు. యోగా చేయడం ద్వారా మన ఆరోగ్యాన్ని, మన శరీరాన్ని బాగా ఉంచుకోవచ్చని తెలిపారు. మంచం మీద పడ్డాక ఎంత బాధపడ్డా ఏం రాదని అన్నారు. అందుకే తప్పకుండా అందరూ యోగా చేయడం నేర్చుకోవాలని సూచించారు. ప్రతిరోజూ అవుట్ డోర్స్ గేమ్స్ ఆడాలన్నారు. జంక్ ఫుడ్ తినవద్దని సూచించారు. మితమైన ఆహారంతోనే అమితమైన ఆరోగ్యమని అన్నారు. యోగా, గేమ్స్ వల్ల ఓటమిని జీర్ణించుకునే శక్తి వస్తుందని చెప్పారు. జీవితంలో ఒడిదొడుకులు నేర్చుకుంటారని అన్నారు. సిద్ధిపేట ఈ రోజు జాతీయ స్థాయిలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు.