మధిర (చింతకాని) ; మొక్కజొన్న సాగు రైతులు యూరియా కోసం బారులు తీరిన ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. చింతకాని ప్రాథమిక సహకార సంఘం(పీఏసీఎస్) పరిధిలో 17 గ్రామాల రైతులు ఉన్నారు. వీరు నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాల్వ కింద 15 వేల ఎకరాల్లో యాసంగిలో మొక్కజొన్న సాగు చేశారు. ఏపుగా వస్తున్న పంటకు యూరియా అవసరంకావడంతో సహకార పురుషులతోపాటు మహిళా రైతులు ఉదయం నుంచే యూరియా కోసం సహకార సంఘాల వద్ద బారులు తీరారు. సాగుకు సరిపోయే విధంగా యూరియా సరఫరా లేకపోవడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వెంటనే పూర్తిస్థాయిలో యూరియాను సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. –
మాఫీ పూర్తికాలే.. ప్రజల్లోకి వెళ్లలేం ; రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి
డిచ్పల్లి, జనవరి 7: ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లోని 33 శాతం మంది రైతులకు మాత్రమే రూ.2 లక్షల లోపు రుణమాఫీ జరిగిందని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్‌లోని డిచ్‌పల్లిలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంటరీ స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్లాలంటే కచ్చితంగా రుణమాఫీ జరిగి తీరాలని స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి సమావేశానికి వచ్చిన వారు సంతకాలు చేయలని సూచించగా రిజిస్టర్లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పేరు రిజిస్టర్లో ఉండి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేరు లేకపోవడంతో ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. జీవన్‌రెడ్డి, సంజయ్ అనుచరుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సమావేశం రసాభాసాగా మారింది.