ACB Raids | రాయికల్, జూన్ 22: రాయికల్ పోలీస్‌స్టేషన్ ఎస్సై తరఫున ఓ వ్యక్తి ఇసుక ట్రాక్టర్ యజమాని నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కగా.. ఎస్సై స్టేషన్ నుంచి పారిపోయాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జగిత్యాల జిల్లా రాయికల్ పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. శనివారం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, బాధితుడు రాజేందర్‌రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన రాజేందర్‌రెడ్డి పశువుల దొడ్డి నిర్మాణం కోసం అదే గ్రామానికి చెందిన వాగు నుంచి ఈ నెల 11న ట్రాక్టర్ ద్వారా ఇసుకను తీసుకొస్తున్నాడు. రాయికల్ పోలీసులు పట్టుకొని పీఎస్‌కు తరలించి కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు రావాల్సిందిగా రాజేందర్‌కు రాయికల్ ఎస్సై అజయ్ తన సిబ్బంది ద్వారా సమాచారం అందించాడు. బాధితుడు స్టేషన్‌కు వెళ్లి ఎస్సైని కలువగా.. ఇసుక ట్రాక్టర్‌పై కేసు నమోదైందని, ట్రాక్టర్‌ను విడిచిపెట్టడానికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వలేనని బాధితుడు రాజేందర్‌రెడ్డి వేడుకోగా.. రూ.30 వేలు ఇస్తేనే పని జరుగుతుందని ఎస్సై గట్టిగా చెప్పాడు. చేసేది లేక బాధితుడు మొదటగా రూ.15 వేలు ఇచ్చాడు. మిగతా రూ.15 వేలు ఇస్తేనే స్టేషన్ బెయిల్ ఇచ్చి ట్రాక్టర్‌ను వదులుతామని చెప్పడంతో రూ.5 వేలు ఇస్తానన్నాడు. రూ.10 వేలు ఇవ్వాల్సిందేనని ఎస్సై తేల్చి చెప్పగా.. రాజేందర్‌రెడ్డి ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మేరకు రాజేందర్‌రెడ్డి రూ.10 వేలు ఇస్తానని శుక్రవారం ఎస్సైకి ఫోన్ చేయగా.. తాను అందుబాటులో లేనని, స్టేషన్ దగ్గర తన మనిషి రాజు ఉన్నాడని, అతనికి ఇవ్వాలని చెప్పడంతో ఇచ్చాడు. వెంటనే ఏసీబీ అధికారులు ఎస్సై తరఫున డబ్బులు తీసుకున్న రాజును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత ఎస్సైని పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు రాయికల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా.. వారిని గమనించిన ఎస్సై అజయ్ స్టేషన్ గోడ దూకి పరారయ్యాడు. దీంతో రాజును అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపర్చినట్టు, పరారీలో ఉన్న ఎస్సై అజయ్‌పై కేసు నమోదు చేసినట్టు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.