హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రానికి ‘రాహు-రేతు’ దోషం పట్టుకున్నదని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. పచ్చగా అలరారుతున్న రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అల్లకల్లోలం జరుగుతున్నదని ఆయన బుధవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు. ఓ వైపు వర్గ ఘర్షణలు, మరోవైపు రైతులకు బేడీలు, రాజకీయ కక్షసాధింపు చర్యలు, జర్నలిస్టులపై దాడులు, కేసులతో రాష్ట్రాన్ని ఎమర్జెన్సీ రోజుల్లోకి తీసుకెళ్లారని దుయ్యబట్టారు. ఫార్మాసిటీకి భూములు ఇచ్చేది లేదని చెప్పిన రైతులపై హత్యాయత్నం కేసులు పెట్టి జైలుకు పంపించడం దుర్మార్గమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని సంపదను దోచుకుని ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలను మాత్రం నెరవేర్చడం లేదని ఆరోపించారు. రైతులు ధాన్యం అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతుండడంతోపాటు గత 11 నెలలుగా రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు తీవ్ర దు:ఖంలో ఉన్నారని పేర్కొన్నారు. ఇదంతా ‘రాహు-రేతు’ దోష ప్రభావమేనని, ఇందుకు దోష నివారణ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.