Miss World pageant | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఆతిథ్యమిస్తున్న మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలను (Miss World pageant) వివాదాలు చుట్టుముడుతున్నాయి. పోటీలకు వచ్చిన ప్రపంచ సుందీమణులను రేవంత్ సర్కార్ రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల సందర్శనకు తీసుకెళ్తున్న విషయం తెలిసిందే. అలా ఇటీవలే రామప్ప ఆలయం సందర్శన సమయంలో అందాల పోటీకి వచ్చిన సుందరీమణుల పాదాలను స్థానిక మహిళలతో కడిగిండచం విమర్శకు దారి తీసిన విషయం తెలిసిందే.
‘విదేశీ యువతుల కాళ్లు కడిగించడం దారుణం. తెలంగాణ సంస్కృతీసంప్రదాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తాకట్టు పెట్టింది. దీనికి మహిళా లోకం బాధపడుతున్నది. దీని ద్వారా సమాజానికి ఏం సంకేతం ఇచ్చారు?. సంప్రదాయమంటూ వెనకేసుకురావడం సరికాదు. వెంటనే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి’ అని వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇదే కాదు అందాల భామలకు ఇచ్చిన ఖరీదైన విందు ఇలా ఒకటేంటి ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది ఈ ఈవెంట్. ఇప్పుడు తాజాగా మరో వార్త వెలుగులోకి వచ్చింది. ఈ అందాల పోటీల నిర్వాహకులపై అసంతృప్తితో మిస్ ఇంగ్లండ్ (Miss England) మిల్లా మాగి (Milla Magee).. ఈ పోటీల నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. ఆమె హైదరాబాద్‌ను వీడి ఇంగ్లండ్‌కు వెళ్లిపోయినట్లు సమాచారం. వ్యక్తిగత కారణాలతోనే పోటీల నుంచి తప్పుకున్నట్లు నిర్వాహకులకు చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే, పోటీల నుంచి తప్పుకున్న తర్వాత ‘ది సన్’ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ పోటీ నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలు చేసినట్లు తెలిసింది. పోటీ నిర్వాహకులు తనను ఓ వేశ్యగా చూస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాదు తనతో కొందరు అగౌరవంగా ప్రవర్తించారని చెప్పుకొచ్చింది. వినోదం కోసం మమ్మల్ని వీధుల్లో తిప్పారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు చాలా అసౌకర్యంగా అనిపించిందని చెప్పుకొచ్చింది. అందుకే మనస్తాపంతో పోటీల నుంచి తప్పుకున్నట్లు తన గోడును వెల్లబోసుకుంది. ‘సమాజంలో మార్పు తీసుకురావడానికి, యువతలో స్ఫూర్తి నింపేందుకు నేను అక్కడికి వెళ్లాను. అయితే, అక్కడ పరిస్థితులు వేరు. కొందరిని సంతృప్తి పరిచేందుకు కోతుల్లా ప్రదర్శన ఇచ్చేందుకు మేం అక్కడున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఉండాల్సి వస్తుందని నేను కలలో కూడా ఊహించుకోలేదు. చాలా అగౌరవంగా అనిపించింది. మనల్ని అక్కడ ఎంత తక్కువగా చూస్తున్నారో అర్థమైంది’ అని ది సన్తో మిల్లా తన ఆవేదనను చెప్పుకుంది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీనిపై మరోసారి రేవంత్ సర్కార్‌పై విపక్షాలు ద్వజమెత్తుతున్నాయి.
బీఆర్ఎస్ పార్టీ విమర్శలు
తెలంగాణ ప్రజల సొమ్ము రూ.250 కోట్లు ఖర్చు పెట్టి మరీ అంతర్జాతీయంగా కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ రాష్ట్ర, హైదరాబాద్ పరువును తీశారని బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టింది. ‘మిస్ వరల్డ్ 2025 ఆర్గనైజర్లు నన్ను వేశ్యలా చూశారు’ అంటూ అందాల పోటీల నుండి మధ్యలోనే హైదరాబాద్ నుండి ఇంగ్లండ్ వెళ్లిపోయిన 2024 మిస్ ఇంగ్లాండ్ – మిల్లా మాగీ.. అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.
కాగా, మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్‌కు ఈనెల 31న హైటెక్స్‌లో గ్రాండ్ ఫినాలే పోటీ ఉండనున్నది. ఇప్పటికే జరిగిన పోటీల్లో ఖండాల వారీగా 24 మంది విజేతలను ఎంపిక చేశారు. అందులో ఇండియా నుంచి నందిని గుప్తా ఉన్న విషయం తెలిసిందే. ఫైనల్ రౌండ్లో ప్రపంచ సుందరి ఎవరో తేలనున్నది.
తెలంగాణ ప్రజల సొమ్ము రూ. 250 కోట్లు ఖర్చు పెట్టి మరీ
అంతర్జాతీయంగా తెలంగాణ రాష్ట్ర, హైదరాబాద్ పరువు తీసిన కాంగ్రెస్ సర్కార్, బ్రోకర్ రేవంత్!హైదరాబాద్ – “మిస్ వరల్డ్ 2025 ఆర్గనైజర్లు నన్ను వేశ్యలా చూశారు” అంటూ అందాల పోటీల నుండి మధ్యలోనే హైదరాబాద్ నుండి ఇంగ్లాండ్ వెళ్లిపోయిన… pic.twitter.com/RmLL2kfT0W
— BRS Party (@BRSparty) May 24, 2025
Also Read..
“అడుసు తొక్కనేల.. కాలు కడుగనేల?”
“Telangana | ఇవి కేసీఆర్ కట్టినవే.. కమాండ్ కంట్రోల్, సచివాలయాన్ని సందర్శించిన సుందరీమణులు”